కరోనా వైరస్ పుణ్యమాని మనుషుల మధ్య దూరం పెరిగింది. ముఖం కూడా సరిగా కనిపించకుండా మాస్కులు పెట్టుకోవాల్సిన పరిస్థితి. పొరపాటున మాస్కు లేకుండా వెళ్లామో.. జేబుకు చిల్లు పడక తప్పదు, లేదా పోలీసుల చేతిలో చీవాట్లు తప్పవు. అయితే ఓ దేశం మాత్రం తప్పు చేసినవారికే బుద్ధి వచ్చేలా తగిన గుణపాఠం చెబుతోంది. అందుకోసం బలవంతంగా వారితో రోడ్లు శుభ్రం చేసే కార్యక్రమానికి పూనుకుంది. వివరాల్లోకి వెళితే.. మడగాస్కర్ అధ్యక్షుడు ఆండ్రీ రాజొలీనా కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా దేశంలోని పలు నగరాల్లో ఫేస్ మాస్కు ధరించడం తప్పనిసరి చేశాడు. ఈ కొత్త నిబంధన సోమవారం నుంచి అమల్లోకి వచ్చింది. అయినప్పటికీ కొంతమంది ఈ మాటలను పెడచెవిన పెట్టి దర్జాగా రోడ్ల మీదకు వచ్చారు. (కరోనా: 189 మంది వలస కార్మికుల మృతి)
ఇంకేముందీ పోలీసులు వారిని రౌండప్ చేసి చేతికి చీపురిచ్చారు. "మమ్మల్ని వదిలేయండి, ఇంకోసారి మాస్కు లేకుండా బయటకు రాబోమ"ని చెప్పినప్పటికీ వదల్లేదు. దీంతో చేసిన పాపం ఊరికే పోతుందా అనుకుంటూ భారంగా ఓ నిట్టూర్పు వదులుతూ రోడ్లపై ఊడ్చే కార్యక్రమానికి దిగారు. ఇలా ఒకరిద్దరికి కాదు.. 25 మందికి దుమ్ము దులిపే శిక్షను విధించారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇదిలా వుండగా ఈ దేశంలో ఇప్పటివరకు 128 కరోనా వైరస్ కేసులు నమోదవగా 75 మంది కోలుకున్నారు. ఇంతవరకు ఒక్క మరణం కూడా సంభవించలేదు. (సముద్ర వీరుల ప్రపంచ రికార్డు)
Comments
Please login to add a commentAdd a comment