బీజింగ్: ఆధునిక చైనా వ్యవస్థాపకుడు మావో జెడాంగ్ తర్వాత చైనాలో అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడిగా ప్రస్తుత చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌కు అరుదైన గౌరవం దక్కింది. జిన్‌పింగ్‌కు దిగ్గజ గౌరవాన్ని కల్పిస్తూ అధికార కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా(సీపీసీ) మంగళవారం తీర్మానం చేసింది. జిన్‌పింగ్ పేరును, ఆయన సిద్ధాంతాలను సీపీసీ రాజ్యాంగంలో చేరుస్తూ చారిత్రక నిర్ణయం తీసుకుంది.
తాజాగా సెంట్రల్ కమిటీకి ఎన్నికవడంతో రెండోసారి చైనా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడం జిన్‌పింగ్‌కు లాంఛనమే. అయితే మావో తరహాలో మూడోసారి కూడా అధ్యక్ష పదవి చేపట్టేలా ఆయన అధికారాన్ని సుస్థిరం చేసుకుంటున్నారు. కాంగ్రెస్ సమావేశాల చివరి రోజున జిన్‌పింగ్ సిద్ధాంతాలను రాజ్యాంగంలో చేరుస్తూ సీపీసీ ఆమోదం తెలిపింది. జిన్‌పింగ్‌కు ముఖ్యనేత(కోర్ లీడర్) స్థాయిని ప్రకటించింది. దీంతో ఇకపై పార్టీలోని నేతలందరికంటే అత్యున్నత స్థాయిలో జిన్‌పింగ్ ఉంటారు.
ఇప్పటి వరకూ మావోతో పాటు మాజీ అధ్యక్షుడు డెంగ్ జియావోపింగ్ ఆలోచనలకు మాత్రమే కమ్యూనిస్ట్ పార్టీ రాజ్యాంగంలో చోటు దక్కింది. చైనాలో సంస్కరణలకు నాంది పలికిన నాయకుడిగా పేరున్న జియావోపింగ్ మరణానంతరం ఆయన ఆలోచనలు, సిద్ధాంతాలకు రాజ్యాంగంలో చోటు కల్పించారు. సీపీసీ చరిత్రకారులు 64 ఏళ్ల జిన్‌పింగ్‌ను పార్టీ వ్యవస్థాపకుడు మావోతో పోలుస్తున్నారు.
జిన్‌పింగ్‌కు ముందు అధికార పగ్గాలు చేపట్టిన జియాంగ్ జెమిన్, హుజింటావో ఆలోచనలకు కూడా రాజ్యాంగంలో చోటు దక్కినా వారి పేర్లు మాత్రం చోటు సంపాదించలేకపోయాయి. తన ఆలోచనలతో పాటు పేరుకు కూడా రాజ్యాంగంలో చోటు దక్కిన మూడో నాయకుడు జిన్‌పింగ్ కావడం గమనార్హం. జిన్‌పింగ్‌తో పాటు అధ్యక్షుడు లీ కెకియాంగ్ కేంద్ర కమిటీలోకి మళ్లీ చోటుదక్కించుకున్నారు. భారత్–చైనా సరిహద్దు చర్చల ప్రత్యేక ప్రతినిధి యాంగ్ జిచికి సీపీసీ కేంద్ర కమిటీలో స్థానం లభించింది.
Comments
Please login to add a commentAdd a comment