
జెనీవా: కరోనా వైరస్ ఇక తమ దేశంలో లేదంటూ ప్రకటించిన ప్రముఖ ఇటాలియన్ వైద్యుడు వాదనలను ప్రపంచ ఆరోగ్య సంస్థ కొట్టి పారేసింది. కరోనా ఇప్పటికీ ప్రాణాంతకమైనదేనని స్పష్టం చేసింది. అప్రమత్తత చాలా అవసరమని హెచ్చరించింది. ఇది ఇప్పటికీ ‘‘కిల్లర్ వైరస్" జాగ్రత్తగా ఉండాలని డబ్ల్యూహెచ్‌ఓ అత్యవర డైరెక్టర్ మైఖేల్ ర్యాన్ పాత్రికేయులతో అన్నారు. ఇది చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. అకస్మాత్తుగా వైరస్ తనకదే మాయమైపోయిందనే భావన వ్యాప్తి చెందకుండా కఠినమైన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. (కరోనా సామర్థ్యం తగ్గిపోయింది)
కరోనా క ట్టడికి మూడు నెలల క్రితం దేశంలో విధించిన లాక్‌డౌన్ ను క్రమంగా సడలించడానికి ఇటలీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్న సమయంలో మిలన్‌లోని శాన్ రాఫెల్ హాస్పిటల్ అధిపతి అల్బర్టో జాంగ్రీల్లో అనే ప్రఖ్యాత వైద్యుడు ఒక సంచలన ప్రకటన చేశారు. కరోనా మటుమాయమైందన్న సంకేతాలిచ్చారు "వాస్తవానికి, వైరస్ వైద్యపరంగా ఇటలీలో లేదు" అని ఆయన ప్రకటించారు. గత 10 రోజుల్లో నిర్వహించిన టెస్టులను, రెండు నెలల క్రితం చేసిన టెస్టులను పోల్చి చూస్తే తాజా టెస్టుల్లో వైరస్ బలహీనంగా కనిపించిందని ఆయన పేర్కొన్నారు. కానీ అనేకమంది ఇతర డాక్టర్లు , ప్రముఖ శాస్త్రవేత్తలు, ఆరోగ్య అధికారులు ఈ వాదనను ఇప్పటికే తోసి పుచ్చారు. కాగా ఇటలీలో కరోనా వైరస్ బారిన పడి 33 వేలమందికి పైగా మరణించారు.