ఈరోజు పుడితే తర్వాతి బర్త్డేకి మీ వయసెంత?
సంధ్యను అమితంగా ప్రేమించే గణేశ్ బర్త్ డేని వాళ్ల నాన్న ఘనంగా నిర్వహిస్తాడు. 'హ్యాపీ హ్యాపీ బర్త్ డేలు మళ్లీ మళ్లీ..' అంటూ హిట్ పాట పాడిమరీ విషెస్ చెబుతాడు. గణేశ్ బర్త్ డే ప్రత్యేకతేంటంటే.. అతను లీపర్. అవును నాలుగేళ్ల కొకసారి మాత్రమే వచ్చే ఫిబ్రవరి 29న పుట్టినరోజు జరుపుకునేవాళ్లను లీపర్స్ అంటారు. అసలింతకీ లీప్ సంవత్సరాలు ఎందుకొస్తాయి? వాటి విశిష్టత ఏంటి? తెలిసిన విషమేఅయినా లీపర్స్ కోసం మరోసారి ఆ అంశాలపై చిన్న లుక్కేద్దాం..
తనచుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ దీర్ఘావృత్తాకార కక్ష్యలో తిరిగే భూమి.. ఒక పరిభ్రమణం పూర్తిచేయడానికి సరిగ్గా 365 రోజుల 5 గంటల 48 నిముషాల 46 సెకన్లు పడుతుంది. కచ్చితంగా చెప్పాలంటే 365.242199 రోజులన్నమాట. కానీ మనకు సంవత్సరంలో ఉన్నవి 365రోజులే. లెక్కింపునకు నోచుకోకుండా మిగిలిపోతోన్న ఆ నాలుగు పావురోజులను(కలిపితే ఒక ఒక రోజు) కలిపి లెక్కించేదే లీప్ ఇయర్!
ఇక్కడ మనం ఇంకో విషయాన్ని కూడా చెప్పుకుందాం.. దీర్ఘ వృత్తకార కక్ష్యలో తిరిగే భూమి.. సూర్యుడికి దగ్గరిగా ఉన్నప్పుడు ఎండాకాలమని, దూరంగా ఉన్నప్పుడు శీతాకాలామని చాలామంది అనుకుంటారు. కానీ అది నిజంకాదు. ఈ ఏడాదిలో భూమి సూర్యుడికి అతి సమీపంగా ఉన్నది శీతాకాలంలోనే. జనవరి 2న సూర్యుడికి కేవలం 147,100,176 కిలోమీటర్ల దూరంలో భూమి ఉంది. దీన్నిబట్టి.. సూర్యుడికి దగ్గరగానో దూరంగానో ఉండటంవల్ల కాక 23.5 డిగ్రీల వంపు తిరిగి భూమి భ్రమణం చెందడం వల్లే రుతువులు ఏర్పడతాయని అర్థం చేసుకోవాలి.