
వాషింగ్టన్/సియోల్/బీజింగ్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మళ్లీ మాటమార్చారు. ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌తో భేటీకి అవకాశాలున్నాయని ప్రకటించారు. కిమ్ వైఖరి కారణంగానే జూన్ 12న సింగపూర్‌లో జరగాల్సిన భేటీని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించిన మరునాడే ట్రంప్ ఇలా మాట మార్చారు. అంతకుముందు ట్రంప్‌తో చర్చలకు సిద్ధమేనని ఉ.కొరియా ప్రకటించింది. సింగపూర్ భేటీ రద్దుపై ట్రంప్ నిర్ణయం ఆకస్మికం, విచారకరమని ఉత్తరకొరియా మొదటి ఉప విదేశాంగ మంత్రి కిమ్ గ్వాన్ అన్నారు. అయితే, ఉత్తరకొరియాపై తమ ప్రభావం ఉందంటూ ట్రంప్ చేసిన ఆరోపణలను చైనా ఖండించింది. మరోవైపు, కిమ్ బలహీనమైన నేత కాదని అమెరికా విదేశాంగ మంత్రి పాంపియో అన్నారు. ‘చర్చల సందర్భంగా కిమ్ నేను చెప్పింది విని పూర్తిగా అర్థం చేసుకున్నారని గ్రహించా. దేశాన్ని, యంత్రాంగాన్ని సమర్ధంగా నడిపించటానికి కృషి చేస్తున్నారు’ అని పాంపియో అన్నారు.