దటీజ్ .. భూమిక
ఓ దొంగోడు వచ్చి తుపాకీని పాయింట్ బ్లాక్‌లో పెట్టి బెదిరిస్తే.. ఎవరైనా ఏం చేస్తారు? భయపడతారు. ప్రాణాలు కాపాడుకోవడానికి ప్రయత్నిస్తారు. దొంగ ఏది అడిగితే అది ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. కానీ ఓ భారతీయ మహిళ మాత్రం అలా భయపడలేదు. తుపాకీ చూసినా దొంగకు లొంగిపోలేదు. క్యాష్ బాక్స్ ఎత్తుకుపోవడానికి ప్రయత్నించిన అతడిపై అపర కాళికలా విరుచుకుపడింది. తుపాకీని పక్కకు తోసి ఆ కుర్ర దొంగను చితకబాదింది. అంతటితో ఆగకుండా చేతికందిన సుత్తితో రాణిరుద్రమ్మలా దాడికి యత్నించడంతో బెదిరిపోయిన దొంగ.. క్యాష్ బాక్స్ అక్కడే వదిలేసి కాళ్లకు బుద్ధి చెప్పాడు. ఈ ఘటన అమెరికాలోని కీస్‌విల్లేలో జరిగింది.
కీస్‌వెల్లేలోని ఓ కిరాణా దుకాణంలో భూమిక పటేల్ అనే భారతీయ మహిళ క్యాషియర్‌గా పనిచేస్తోంది. 17 ఏళ్ల క్రిస్టియన్ డకోటా.. ఆమె పనిచేస్తున్న దుకాణంలో దొంగతనానికి యత్నించాడు. తుపాకీని పాయింట్ బ్లాక్‌లో పెట్టి డబ్బు ఇచ్చేయమంటూ బెదిరించాడు. కానీ భూమిక వాడిని బెంబేలెత్తించింది. ‘నన్ను కాలుస్తావా.. సరే కాల్చేయ్’ అంటూ ఎదురుదాడి చేసింది. తుపాకీని బేఖాతరు చేస్తూ చేతికందిన వస్తువుతో చితకబాదింది. వీరోచిత సాహసాన్ని ప్రదర్శించిన భూమిక పటేల్ ఇప్పుడు స్థానికంగా పెద్ద ఐకాన్ అయ్యారు. ఆమె గురించి స్థానిక మీడియా గొప్పగా కథనాలు ప్రచురిస్తోంది. ఆమె దొంగను చితకబాదిన సీసీటీవీ కెమెరా వీడియో ఫుటేజీని స్థానికులు ప్రత్యేకంగా వచ్చి తిలకిస్తున్నారు. ఆమె ధైర్య సాహసాలను మెచ్చుకుంటున్నారు.