
ఎర్రటి చిగుళ్లపై నల్లటి టాటూ
వెర్రి వెయ్యి రకాలన్నట్లు..... అందాన్ని పొందటం కోసం నేటి తరం ఎంతటికైనా లెక్కచేయటం లేదు. ఉన్న అందాన్ని మరింత ద్విగుణీకృతం చేసుకోవటానికి చాలామంది బొటాక్స్, ఫేస్ లిప్ట్లు, రకరకాల సర్జరీలు చేయించుకోవటం ఈకాలంలో పరిపాటిగా మారిన విషయం తెలిసిందే. అయితే పచ్చబొట్టు పాతమాట. టాటూ అనేది కొత్త బాట. తాజాగా చాలామంది ఆకర్షణీయంగా ఉండటంతో పాటు, సెక్సీ లుక్ కోసం 'టాటూ'లపై పడుతున్నారు. ఈ మధ్య చాలామందికి టాటూల పిచ్చి బాగా ముదిరింది. చాలా మంది తమకు నచ్చిన విధంగా రకరకాల టాటూలు ఒంటి మీద వేయించుకుంటారు . ఈ కాలంలో ఇదో వేలం వెర్రి.
అయితే ఈ వెర్రి ఇప్పుడు మరింత ముదిరింది. ఓ ఆఫ్రికన్ మహిళ అందమైన చిరునవ్వు కోసం తన చిగుళ్లపై నల్లటి టాటూలు వేయించుకుంది. పశ్చిమ ఆఫ్రికా దేశాల్లో మహిళలు తమకు జన్మత వచ్చే సహజమైన ఎరుపురంగు చిగుళ్ల కంటే నల్లటి చిగుళ్లు మరింత ఆకర్షణీయంగా ఉంటాయని భావిస్తున్నారు. దానివల్ల తమ చిరునవ్వు మరింత ఆకర్షణీయంగా ఉంటుందని నమ్ముతుంటారు. దీనివల్ల చిగుళ్లు మరింత ఆరోగ్యవంతంగా ఉంటాయని, చెడు శ్వాసను దూరంగా ఉంచుతుందని భావిస్తుంటారు. దాంతో వారు చిగుళ్లకు రంగేసుకునేందుకు టాటూలను ఆశ్రయిస్తున్నారు.
అయితే ఈ టాటూల తతంగం ....ఏ సెలూన్లో కాకుండా తమ కుటుంబ సభ్యుల మధ్యే టాటూ ఆర్టిస్ట్తో ఇంటి ఆవరణలో చేయించుకోవటం విశేషం. అది కూడా చాలా చవకగా ఒక్క డాలర్ ఖర్చుతో టాటూ వేయించుకోవటం పూర్తవుతుంది. ఈ టాటూ వేయించుకోవటం కోసం అక్కడ మహిళలు ఎంతటి నొప్పిని అయినా భరించటానికి వెనకాడరు. ఏడు లేయర్లుగా ఈ టాటూను వేయాల్సి ఉంటుంది.
చిగుళ్లను అందంగా తీర్చిదిద్దుకునేందుకు మరియం అనే మహిళ తన అనుభవాన్ని చెబుతూ 'టాటూ వేయించుకునే సమయంలో నొప్పిని భరించలేకపోయాను. చచ్చిపోతానేమోనని కూడా భయం వేసింది. ఈ టాటూల హింసను మరొకరికి సిఫార్సు చేయను' అని తెలిపింది. అయితే టాటూ వేయించుకున్న తర్వాత మాత్రం అందమైన చిరునవ్వు ముందు బాధ ఓ లెక్కలోనిది కాదని ఆమె చెప్పటం విశేషం.