కిషన్ గంగ జలవిద్యుత్ ప్రాజెక్టు (ఫైల్ ఫొటో)
వాషింగ్టన్ : ప్రపంచ బ్యాంక్‌లో పాకిస్తాన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించిన కిషన్ గంగ జలవిద్యుత్ ప్రాజెక్ట్ సింధు జలాల ఒప్పందం 1960కి విరుద్ధమని పాక్ ప్రపంచ బ్యాంక్‌ను ఆశ్రయించింది. పాక్ అభ్యంతరాలను తొసిపుచ్చిన వరల్డ్ బ్యాంక్, వివాద పరిష్కారానికి తటస్థ నిపుణుడిని ఏర్పాటు చేయాలన్న భారత్ వాదనలను ఆమోదించింది. ఈ విషయంలో వెనక్కి తగ్గాలని ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు జిమ్‌యాంగ్ కిమ్ పాక్ ప్రభుత్వానికి సూచించినట్లు డాన్ పత్రిక పేర్కొంది. గత గురవారమే అటార్నరీ జనరల్ ఆఫ్ పాకిస్తాన్‌కు (ఏజీపీ) ప్రపంచ బ్యాంకు నుంచి ఓ లేఖ అందిందని ది ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ పేర్కొంది. కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్‌ను ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ను పాక్ వదులుకుంటే భారత్ సూచించినట్లుగా ఈ వివాద పరిష్కారానికి తటస్థ నిపుణుడు నియమిస్తామని ఆ లేఖలో ప్రపంచ బ్యాంకు పేర్కొన్నట్లు ఆ పత్రిక ప్రచురించింది.
గత నెల జమ్మూ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ జీలం ఉపనది అయిన కిషన్‌గంగ నదిపై 330 మెగావాట్ల జలవిద్యుత ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు డిజైన్‌తో తమకి తీవ్ర నష్టం వాటిల్లుతుందని పాక్ తొలి నుంచి వాదిస్తూ వస్తోంది. ఈ వివాదం పరిష్కారానికి కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్‌ను ఏర్పాటు చేయాలంటూ గతంలోనే పాక్ ప్రపంచ బ్యాంకును కోరింది. నది గమనంలో మార్పులేకపోయినా, దిగువకు వచ్చే నీటి శాతం తగ్గిపోతుందని పాక్ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. 2007లో భారత్ ఈ ప్రాజెక్టును ప్రారంభించిన వెంటనే అంతర్జాతీయ న్యాయస్థానాన్ని పాక్ ఆశ్రయించింది. దీనిపై స్టే విధించడంతో నిర్మాణ పనులు మూడేళ్లపాటు నిలిచిపోయాయి.
కానీ 2013లో భారత్‌కు అనుకూలంగా అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పును వెలువరించింది. ‘ఇది సింధు జలాల ఒప్పందంలో భాగమే. జలవిద్యుత్ కేంద్రాన్ని నిర్మించుకునే హక్కు భారత్‌కు ఉంది. అలాగే వరల్డ్ బ్యాంక్ ఒప్పందం ప్రకారం కూడా భారత్ ఆ నదులపై డ్యామ్‌లను నిర్మించుకోవచ్చు’ అని న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. మరోవైపు వరల్డ్ బ్యాంకు కూడా ఒప్పందానికి లోబడే భారత్ జీలం, చీనాబ్ ఉప నదులపై ప్రాజెక్టులను నిర్మిస్తోందంటూ చెబుతోంది.
Comments
Please login to add a commentAdd a comment