
ఇక ఆసుపత్రుల్లో రోబో నర్సులు!
ఇక మీదట చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్లినప్పుడు అక్కడ రోబో నర్సులు కనిపించే అవకాశం ఉంది
లండన్: ఇక మీదట చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్లినప్పుడు అక్కడ రోబో నర్సులు కనిపించే అవకాశం ఉంది. ఆసుపత్రిలో నర్సులు చేసే పనులను రోబోలు సమర్థవంతంగా నిర్వర్తిస్తాయని ఈ అంశంపై పరిశోధన నిర్వహించిన ఇటలీలోని పాలిటెక్నికో డి మిలానో యూనివర్సిటీ చెందిన పరిశోధకులు డాక్టర్ ఎలినా డి మోమీ వెల్లడించారు.
ముఖ్యంగా సర్జరీల సమయంలో నర్సులకు బదులుగా డాక్టర్లకు సహకరించడంలో రోబోలు తోడ్పడుతాయని డి మోమీ వెల్లడించారు. సర్జరీలకు అవసరమైన ఎక్విప్‌మెంట్ను అందించడం దగ్గర నుంచి.. అన్ని విషయాల్లో డాక్టర్లకు రోబోలు సహకరిస్తాయని ఆమె తెలిపారు. పదేపదే చేయాల్సిన పనులవల్ల మనుషుల్లో విసుగు, అనాసక్తత ఏర్పడే అవకాశం ఉన్నా.. రోబోల విషయంలో దీనికి ఆస్కారం లేదని తెలిపారు. ఆరోగ్య రంగంలో మనుషుల ఉద్యోగాలను పూర్తిగా రోబోలతో భర్తీ చేయలేమని, పనిభారాన్ని తగ్గించుకోవడానికి ఇవి బాగా తోడ్పడుతాయని డి మోమీ తెలిపారు.
ఫ్రాంటియర్స్ ఇన్ రోబోటిక్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ అనే జర్నల్‌లో డి మోమీ బృందం పరిశోధనలు ప్రచురించారు. దీని ప్రకారం.. ఆపరేషన్ థియెటర్‌లో మనుషులు, రోబోల పనితీరును పరిశీలించగా.. రెండింటి మధ్య పెద్ద తేడాలను గుర్తించలేదు. రోబోలు కూడా మనుషుల మాదిరిగానే చేతి కదలికలను చూపించినట్లు గుర్తించారు. టెన్షన్‌తో కూడుకున్న ఆపరేషన్ థియెటర్‌లోని పనుల్లో రోబోల వాడకంతో సేఫ్టీ పెరుగుతుందని డి మోమీ తెలిపారు.