మానవ స్పర్శ కోసం దీనంగా దేవలోకం వైపు చూస్తూ ఉన్న ప్రపంచానికి ‘గ్రేస్’ అనే ఒక హ్యూమనాయిడ్ నర్సు వెచ్చని టచ్‌ని ఇచ్చి, కోవిడ్ కలవరం నుంచి సాంత్వన కలిగించనుంది! బ్లూ డ్రెస్ ధరించి ఉండే ఈ కరుణామయి.. ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న కోవిడ్ బాధితులకు దగ్గరగా వెళ్లి, చేతిలో చెయ్యి వేసి.. ‘ఎలా ఉన్నారు?’ అని అడుగుతుంది. ‘తప్పక నయం అవుతుంది’ అని చిరునవ్వు కళ్ల తో ధైర్యం చెబుతుంది. ఇంకా.. వేళకు మందులు గుర్తు చేస్తుంది. సున్నితంగా సూది మందు గుచ్చుతుంది. హాంగ్ కాంగ్ ల్యాబ్‌లోంచి త్వరలోనే బయటికి రానున్న ఈ దయాళువులో మానవులు సృష్టించిన దైవాంశ ఏదో ఉన్నట్లే ఉంది!
చైనాలోని వుహాన్ ల్యాబ్ నుంచి కరోనా వైరస్ వస్తే వచ్చి ఉండొచ్చు గాక.. కరోనా వైద్య సేవలు అందించడం కోసం హాంకాంగ్‌లోని హాన్సన్ ల్యాబ్ నుంచి గ్రేస్ అనే ఒక రోబో నర్సు రాబోతున్నారు! కేవలం సేవలే కాదు, కరోనా వార్డులోని రోగులతో ఆమె ‘సిస్టర్’లా సాంత్వన వచనాలు పలుకుతారు. ‘మీకేమీ కాదు. త్వరగా కోలుకుంటారు’ అని ధైర్యం చెబుతారు. అయితే ఇదంతా కూడా ఇంగ్లిష్‌లో. మరికొన్ని రోజుల తర్వాత ఒకటీ రెండు అంతర్జాతీయ భాషలలో కూడా. అయినా మనసును నెమ్మది పరిచే స్పర్శ అనే ‘అమ్మ భాష’ ఎవరికి అర్థం కాకుండా ఉంటుంది. గ్రేస్ తాకి మాట్లాడతారు. హృదయాన్ని టచ్ చేస్తారు. గ్రేస్ ఒక హ్యూమనాయిడ్ రోబో. స్త్రీ రూపంలోని మర మనిషి.
Meet Grace, the humanoid robot designed to interact with the elderly and those isolated by the global health crisis https://t.co/QmICTkKsti pic.twitter.com/nclTArYIrl
— Reuters (@Reuters) June 10, 2021
హాంకాగ్‌లోని హాన్సన్ రోబోటిక్స్ ల్యాబ్‌లో ‘జీవం’ పోసుకున్న గ్రేస్ ప్రస్తుతం తుది శిక్షణలో ఉంది. ప్రధానంగా కోవిడ్ వార్డుల ఐసోలేషన్ లో ఉన్న వృద్ధులకు సేవలను అందించడం కోసం ఆసుపత్రులలోని ఫ్రంట్‌లైన్ సిబ్బందికి చేయూతగా హాన్సన్ కంపెనీ ఈ రోబోను రూపొందించింది. గ్రేస్ శుభ్రమైన నీలం రంగు యూనిఫామ్ ధరించి ఉంటుంది. ఆసియా అమ్మాయిల రూపురేఖలు ఉంటాయి. పేషెంట్ ల శరీర ఉష్ణోగ్రత కొలవడం కోసం ఆమె కంఠానికి దిగువ భాగంలో కెమెరా ఉంటుంది. తల వెనుక భాగంలో అమర్చి ఉండే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చిప్స్‌తో ఆమె రోగులకు అవసరమైన అన్ని సేవలూ అందిస్తుంది. మందులివ్వడం, ఇంజెక్షన్ చేయడం మాత్రమే కాకుండా.. మానసికమైన కుంగుబాటులో ఉన్న రోగిని గుర్తించి మాటలు కలుపుతుంది.
టాక్ థెరపీ ఇచ్చి ఒంటరితనాన్ని పోగొడుతుంది! రోగి కన్నీళ్లు పెట్టుకుంటే... ‘కమ్మాన్.. ’ అంటూ కళ్లు తుడుస్తుంది. రోగితో సహానుభూతి పొందడం కోసం ల్యాబ్ వాళ్లు 48 రకాల ముఖ వ్యక్తీకరణ లు గ్రేస్‌కి ‘ఫీడ్’ చేశారు. సంతోషానికి సంతోషం. విచారానికి విచారం. నవ్వుకు నవ్వు. ఇలా.. ముఖాముఖిలా సాగుతుంది. గ్రేస్ మనిషిలా మాట్లాడుతుంటే.. రోగులు మంత్రముగ్ధులై రోబోలా మారిపోతారు. ‘‘గ్రేస్‌లో ఇదెంతో మంచి విషయం’’ అని హవాయి యూనివర్శిటీలో కమ్యూనికాలజీ ప్రొఫెసర్‌గా ఉన్న మిన్–సున్ అంటున్నారు. గ్రేస్ తయారీకి ఆమె సహకారాన్ని కూడా హాన్సన్ ల్యాబ్ తీసుకుంది. గ్రేస్‌ను ముందుగా భారత్‌లోనే ‘లాంచ్’ చేయాలని అనుకుంటున్నారు. ఆ తర్వాత ఆర్డర్‌లని బట్టి వేల సంఖ్యలో గ్రేస్‌లను ప్రపంచమంతటా ఉత్పతి చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment