
ఎంపీకి ఝలక్ ఇచ్చిన ఘరానా దొంగ!
ఓ ఎంపీకి ఘరానా దొంగ గట్టి ఝలక్ ఇచ్చాడు. అతడిని మాయమాటలతో నమ్మించి సర్వస్వం దోచాడు. చివరకు పోలీసులకు చిక్కాడు
న్యూఢిల్లీ: ఓ ఎంపీకి ఘరానా దొంగ గట్టి ఝలక్ ఇచ్చాడు. ఎంపీని మాయమాటలతో బురిడికొట్టించి సర్వస్వం దోచాడు. ఆ ఎంపీకి చెందిన విలువైన వస్తువులు దొంగిలించి అవాక్కయ్యేలా చేశాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. అఫ్ఘానిస్తాన్ పార్లమెంట్ ఎంపీ అయిన డాక్టర్ సయ్యద్ గులామ్ ఫరూక్ మిర్రానే అనే వ్యక్తి వైద్యం నిమిత్తం భారత్కు వచ్చాడు. ఈ విషయం ముందే తెలుసుకున్న అఫ్ఘానిస్తాన్ కే చెందిన నూరుల్లా అరబ్ అనే 21 ఏళ్ల యువకుడు ఫరూక్ మిర్రానేను సంప్రదించాడు.
తాను అనువాదకుడిగా సహాయపడతానని చెప్పి గత ఆదివారం ఆయనను ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో స్వాగతం పలికాడు. అనంతరం ఆయనతోపాటు లజపత్ నగర్ లోని ఓ హోటల్ కు వెళ్లాడు. అనంతరం ఆయన కళ్లుగప్పి పర్స్, మొబైల్ ఫోన్, రూ.3,12,107 డబ్బు, క్రెడిట్ కార్డులు, మూడు ఆయుధాల లైసెన్సులు ఎత్తుకెళ్లిపోయాడు.
అందులో ఒక లైసెన్స్ ఏకే 47 తుపాకీకి సంబంధించినది. ఈ మేరకు ఆ ఎంపీ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కంగారు పడ్డారు. గణతంత్ర వేడుకలు దగ్గరకు రావడం దొంగతనానికి పాల్పడిన యువకుడి చేతిలో ఆయుధాల లైసెన్సులు ఉండటం వారిని హడలెత్తించింది. దీంతో వేగంగా స్పందించి అతడిని అరెస్టు చేశారు. అరెస్టయిన నూరుల్లా అఫ్ఘానిస్తాన్ లోని మజరీ షరీఫ్ ప్రాంతానికి చెందినవాడు. గత మార్చిలోనే అతడు భారత్ కు వచ్చి ఢిల్లీలోని భోగల్ ప్రాంతంలో అద్దెకు ఉంటున్నాడు.