
వారసుడిని కన్నాడు.. కంటికి రెప్పలా పెంచాడు.. విద్యాబుద్ధులు నేర్పించాడు.. జీవితాన్ని చదివించాడు.. కష్టపడి సంపాదించాడు.. కొడుకులు ఎదిగాక సమానంగా పంచిఇచ్చాడు. తానూ బతికేందుకు కొంత ఉంచుకున్నాడు. అదీ కావాలంటూ కొడుకు వేధించడంతో సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు. దాడికి దిగడంతో మరో కొడుకుతో కలిసి క్షణికావేశంలో ప్రాణం తీశాడు.. ఈ ఘటన జగిత్యాల జిల్లా అనంతారంలో సోమవారం చోటు చేసుకోగా.. పండుగ పూట ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది.
జగిత్యాలరూరల్: జగిత్యాల మండలం అనంతారం గ్రామానికి చెందిన చిలువేరి పోశెట్టి, గంగవ్వ దం పతులది వ్యవసాయాధారిత కుటుంబం. ఇతడికి రాజమల్లు(38), మహేశ్ అనే ఇద్దరు కొడుకులు ఉ న్నారు. కష్టపడి సంపాదించిన 1.20 ఎకరాల భూ మిలో వ్యవసాయం చేస్తూ.. ఇద్దరు కొడుకులను పెంచి పోషించి వివాహాలు చేశాడు. పెద్దకుమారుడు రాజమల్లుకు భార్య రాజేశ్వరి, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. దంపతులు వ్యవసాయం, కూలీపని చేస్తారు.
భూమిని పంచి ఇచ్చి...
పోశెట్టి ఇద్దరు కుమారులకు భూమిని సమానంగా పంచి ఇచ్చాడు. రాజమల్లుకు 20గుంటలు, మహేశ్‌కు 20గుంటలు ఇచ్చి తానూ 20 గుంటలను సాగు చేస్తున్నాడు. పోశెట్టి, మహేశ్ ఉమ్మడిగా ఉంటుండగా, రాజమల్లు కుటుంబం అదే ఇంట్లో వేరుగా ఉంటున్నారు.
మిగిలిన భూమి పంచివ్వాలని...
ఇరువై గుంటల్లో వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్న రాజమల్లు కన్ను తన తండ్రి భూమిపై పడింది. తమ్ముడు తండ్రి ఉమ్మడిగా ఉంటు న్నారు కాబట్టి.. ఇరువై గుంటల్లో 10 గుంటలు తన పేరుమీద రిజిస్ట్రేషన్ చేయాలని తండ్రితో నాలుగు సంవత్సరాలుగా గొడవ పడుతున్నాడు. అయినప్పటికీ తాను ఎలా బతికేదని, ఆ భూమితోనే తాను, భార్య బుక్కెడు బువ్వ తింటున్నామని భూమిని ఇవ్వనని పోశెట్టి తెగేసి చెబుతూ వచ్చాడు.
మద్యం మత్తులో...?
సోమవారం రాత్రి మద్యం మత్తులో వచ్చిన రాజమల్లు ఇంటి వద్దనున్న తండ్రి పోశెట్టి, తమ్ముడు మహేశ్‌తో భూమి పంచి ఇవ్వాలని గొడవ పడ్డాడు. ఇంట్లో ఉన్న గడ్డపారతో వారిపై దాడికి యత్నించాడు. అప్రమత్తమైన పోశెట్టి, మహేశ్ అక్కడే ఉన్న ఇనుప గొట్టం, పారకామతో రాజమల్లు తలపై కొట్టారు. దీంతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు.
పోలీసుల దర్యాప్తు..
విషయం తెలుసుకున్న రూరల్ సీఐ శ్రీనివాస్‌చౌదరి, హెడ్‌కానిస్టేబుల్ గోపాల్‌రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ డీఎస్పీ భద్రయ్య వివరాలు సేకరించారు. మృతుడి భార్య ఫిర్యాదుతో పోశెట్టి, మహేశ్‌పై కేసు నమోదు చేశారు.
చంపిన చేతులతో అంత్యక్రియలు..
క్షణికావేశంలో దాడి చేసిన పోశెట్టి కొడుకు మృతి చెందాడన్న విషయం గమనించి షాక్‌కు గురయ్యాడు. ‘పెంచి పోషించిన చేతులతో ప్రాణం తీశానా కొడుకా..’ అంటూ అతడి మృతదేహంపై పడి గుండెలవిసేలా రోదించాడు. పోస్టుమార్టం అనంతరం తండ్రి పోశెట్టి కొడుకు అంత్యక్రియలు నిర్వహించాడు.
Comments
Please login to add a commentAdd a comment