
సాక్షి, కర్ణాటక: రోజురోజుకు యువతి, యువకుల్లో సెల్ఫీ మోజు పెరిగిపోతోంది. సెల్ఫీ మోజుతో యువత ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ప్రమాదకర ప్రదేశాల్లో సెల్ఫీలు దిగటానికి ఏమాత్రం వెనుకకాడటం లేదు. సెల్ఫీల మోజులో పడి యువత జీవితం విలువను మర్చిపోతున్నారు. అదే ఇప్పుడు కన్నవారికి కడుపుకోత మిగిలిస్తోంది. కర్ణాటక రాజధాని బెంగళూరుకి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న బిడాడీలో మంగళవారం ఉదయం ఓ విషాద సంఘటన చోటుచేసుకుంది. సెల్ఫీ మోజులో ముగ్గురి యువకులు మరణించారు.
రైల్వే ట్రాక్‌పై నిలబడి సెల్ఫీ దిగుతున్న ముగ్గురు యువకులు అటుగా వస్తున్న రైలును కూడా పట్టించుకోకపోవడంతో పండండి జీవితాలను గాలిలో కలుపుకున్నారని పోలీసులు చెబుతున్నారు. వారి మృతదేహాలు రైల్వే ట్రాక్‌పై గుర్తుపట్టలేని స్థితిలో పడ్డాయి. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గత వారం జయనగర్‌లోని నేషనల్ కాలేజీ విద్యార్థి విశ్వాస్ చెరువులో మునిగిపోయాడు. ఆ సమయంలో తన స్నేహితులందరూ కలిసి సెల్ఫీ దిగే మోజులో పడిపోయిన ఘటన తెలిసిందే..