
రాజా నగరం: ఖమ్మం నగరంలోని కొత్తగూడెంకు చెందిన ఓ కుటుంబం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజమహేంద్రవరం సమీప రాజానగరం వద్ద రోడ్డు ప్రమాదానికి గురికావడంతో..ఆ ఇంట తీవ్ర విషాదం మిగిలింది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..కొత్తగూడేనికి చెందిన నల్లమోలు శివాజీ హైదరాబాద్‌లో ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. సంక్రాంతి పండగకు..తన భార్య లక్ష్మీతులసి(28), ఇద్దరు చిన్నారులు, తమ వద్దే ఉంటున్న బావమరిది గుర్రెల శివాజీ(26)తో కలిసి దేవీపట్నం మండలం ఇందుకూరిపేటకు స్నేహితుడి కారు తీసుకుని వెళ్లారు. నాలుగు రోజులు సరదాగా గడిపి..భార్య, పిల్లలు, బావమరిదితో కలిసి బుధవారం అర్ధరాత్రి దాటాక కారులోనే తిరుగు ప్రయాణమయ్యారు.
కొంతమూరు వద్ద జాతీయ రహదారిపైకి ఎక్కిన కొద్దిసేపటికే కారు టైరు పంక్చర్ కావడంతో..రోడ్డు పక్కన ఆపి మంచుకురుస్తుండగానే అంతా కలిసి చక్రాన్ని మార్చారు. అనంతరం సామగ్రిని తిరిగి డిక్కీలో వేస్తుండగా వెనుక నుంచి అతివేగంగా వచ్చిన గుర్తు తెలియని వాహనం వారిని ఢీ కొట్టింది. కారుతో సహా ఈ ముగ్గురూ కొద్దిదూరం ఎగిరిపడ్డారు. దీంతో లక్ష్మీతులసి అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన ఆమె తమ్ముడు గుర్రెల శివాజీ ఆస్పత్రిలో మరణించాడు. నల్లమోలు శివాజీకి కూడా తీవ్ర గాయాలయ్యాయి. అపస్మారక స్థితిలో ఉన్న అతడిని రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేస్తున్నారు. ప్రమాద సమయంలో కారు వెనుక సీటులో నిద్రపోతున్న ఎనిమిది, నాలుగు సంవత్సరాల చిన్నారులు తనుశ్రీ, నిహాల్‌లకు స్వల్పగాయాలయ్యాయి. రాజానగరం ఇన్‌చార్జ్ సీఐ సుబ్రహ్మణ్యం, ఎస్సై జగన్‌మోహన్ తమ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని, కేసు దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment