పుచ్చ సాగు మెళకువలు | Techniques In Watermelon Foaming | Sakshi
Sakshi News home page

పుచ్చ సాగు మెళకువలు

Published Mon, Jan 22 2018 4:55 PM | Last Updated on Mon, Jan 22 2018 4:57 PM

 Techniques In Watermelon Foaming - Sakshi

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): సీజన్లతో సంబంధం లేకుండా పుచ్చకాయలను ప్రజలు కొనుగోలు చేస్తుంటారు. ఇక వేసవికాలంలో వీటికి బాగా డిమాండ్‌ ఉంటుంది. ఇప్పటికే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వివిధ పంటల్లో అంతరపంటగా పుచ్చకాయ పైరును సాగు చేస్తున్నారు. ప్రస్తుతం పుచ్చ తీగలు పూత, కాత దశలో ఉన్నాయి. ఇప్పుడు సాగు జాగ్రత్తలు చాలా కీలకం. తెగుళ్లు ఆశిస్తే..పంట దిగుబడిపై ప్రభావం పడే అవకాశం ఉంది. కొత్తగూడెం, జూలూరుపాడు, సుజాతనగర్, టేకులపల్లి, ఇల్లెందు, అన్నపురెడ్డిపల్లి, చండ్రుగొండ, పాల్వంచ తదితర మండలాల్లో 238 ఎకరాల్లో ఈ పుచ్చపంటను సాగు చేస్తున్నారు. పాటించాల్సిన సాగు మెళకువలను జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖాధికారి జినుగు మరియన్న ఇలా వివరించారు.  

సాగు విధానం..
పుచ్చపంటను వ్యవసాయ భూముల్లో నేరుగా వేసుకోవచ్చు. లేదంటే వివిధ పంటల్లో అంతర పంటగా దీనిని సాగు చేసుకోవచ్చు. ఎకరానికి 80 నుంచి 90 రోజుల వ్యవధిలో రూ.60వేల రూపాయల పైచిలుకు నికర ఆదాయం పొందొచ్చు. మేలైన యాజమాన్య పద్ధతులు పాటించాల్సి ఉంటుంది. విత్తనం సాగు చేసే దశనుంచే..రైతులు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా తెగుళ్ల పీడను గుర్తించాలి. సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించి..తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకోవడం ఉత్తమం. రసాయన ఎరువులను అధికంగా వినియోగించొద్దు. సేంద్రియ ఎరువులను వాడడం ద్వారా కూడా మంచి దిగుబడి పొందొచ్చు.  

తెగుళ్ల నివారణ..
ఆకుమచ్చ తెగులు ఈ పంటలో కనిపిస్తుంది. దీని నివారణకు లీటరు నీటికి రెండు గ్రాముల సాఫ్‌ మందును కలిపి పిచికారీ చేయాలి. ఆకు ముడత నివారణకు లీటరు నీటికి ఒక గ్రాము ఎసిఫిల్‌ లేదా సువాస్‌ రెండు మిల్లీ లీటర్లతోపాటు ఐదు మిల్లీలీటర్ల వేపనూనెను కలిపి పిచికారీ చేయాలి. నాణ్యమైన ఉత్పత్తికి, కాయ ఎదుగుదలకు పంటకాలంలో వారానికి ఒకసారి 19:19:19 లేదా 13:0:45 లను కేజీ పరిమాణాన్ని డ్రిప్‌ ద్వారా ఫెర్టిగేషన్‌ పద్ధతిలో అందించాలి. అలాగే నాణ్యతకు, నిల్వకు దోహదపడే బోరాన్‌ మూలకాన్ని బోరాక్స్‌ రూపంలో పిచికారీ చేయాలి. లీటరు నీటికి రెండు గ్రాములు లేదా పంట కాలంలో ఎకరానికి రెండు నుంచి మూడు కేజీలపై పాటుగా లేదా డ్రిప్‌ అందించాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement