ఐఏఎస్ అధికారి ఎం.పద్మ
సాక్షి, విజయవాడ : దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం కార్యనిర్వహణాధికారి(ఈఓ)గా ఐఏఎస్ అధికారి ఎం.పద్మ సోమవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆమెకు అనేక సమస్యలు, సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. గత ఈఓలు నిష్క్రమించిన తీరును చూస్తే ఆలయ ఈఓ పదవి ముళ్ల కిరీటం వంటిదని అర్థమవుతుంది. ఆలయంలోని సమస్యలనే కాదు, రాజకీయ ఒత్తిళ్లనూ ఎదుర్కోక తప్పదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మంత్రి లోకేష్ కోసం గత ఈఓ సూర్యకుమారి తాంత్రిక పూజలు నిర్వహించారన్న ఆరోపణలు రావడంతో బదిలీకాక తప్పలేదు. దేవస్థానంలో దీర్ఘకాలంగా తిష్టవేసిన అధికారులు, ఉద్యోగులు, పాలకమండలి నుంచి వచ్చే సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
అవినీతి సర్వాంతర్యామి!
దుర్గగుడిలో అవినీతి సర్వాంతర్యామిగా మారిందన్న విమర్శలు ఉన్నాయి. అన్నదానం, ప్రసాదాలు తయారీ, అకౌంట్స్, స్టోర్స్, టికెట్ విక్రయాలు, ఇంజినీరింగ్ ఇలా అన్ని విభాగాల్లోనూ అవినీతిని విజిలెన్స్ అధికారులు గత ఏడాది ఎండగట్టారు. అటెండర్లు టికెట్లను రీసైక్లింగ్ చేస్తుండగా భక్తులు పట్టుకుని అధికారులకు అప్పగించారు. అన్నదానంలో భోజనం చేసిన భక్తుల కంటే ఎక్కువ మందిని లెక్క చూపించడం, అకౌంట్ విభాగంలో అడ్వాన్సులు తీసుకోవడం, ప్రసాదాల తయారీ దిట్టంలో హస్తలాఘవం, అడ్డగోలు నిర్మాణాలు చేపట్టడం, వాటిని కూల్చివేయడం వంటివి సర్వ సాధారణమయ్యాయి. దేవస్థానంలో దీర్ఘకాలంగా తిష్టవేసిన అధికారులకు ఎన్నిరకాలుగా అవినీతి చేయాలో తెలుసన్న విమర్శలు ఉన్నాయి. కొత్త ఈఓ దేవస్థానంలో తిష్టవేసిన అవినీతిపై దృష్టి సారించాలని భక్తులు
కోరుతున్నారు.
తరిగిపోతున్న అమ్మవారి మూలధనం
దేవస్థానంలో అభివృద్ధి పేరుతో అనేక భవనాలను కూల్చివేశారు. కొత్తకొత్త నిర్మాణాలు చేపట్టారు. ఇటీవల అన్నదానం కోసం తాత్కాలిక భవనం నిర్మించారు. అర్జున వీధిలో అందం కోసం పర్గోలా నిర్మిస్తున్నారు. ఘాట్‌రోడ్డుకు తరుచూ మరమ్మతులు చేస్తున్నారు. భవానీమండపం, అన్నదానం భవనం కూల్చిన చోట నూతన నిర్మాణాలు చేయాల్సి ఉంది. అభివృద్ధి పనులన్నీ నత్తనడకన సాగుతున్నాయి. మరోవైపు ఆలయ మూల నిధులు తరిగి పోతున్నాయి. రూ.125 కోట్ల మూలధనం రూ.60 కోట్లకు తగ్గిపోయింది. ప్రస్తుతం జరుగుతున్న పనులకు ఉన్న మూలధనం చాలదు. ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా సాయంగా అందనందునే ఈ పరిస్థితి నెలకొంది. కొత్త ఈఓ మూలధనం పెంచాల్సిన అవసరం ఉంది.
రాజకీయ నేతల ఒత్తిళ్లు
దుర్గగుడిలో అర్చకుల నుంచి సిబ్బంది వరకు జిల్లాలో ఎవరో ఒక నాయకుడితో సంబంధాలు ఉన్నాయి. గుడిలో చీమ చిటుక్కుమన్నా, జిల్లాకు చెందిన ఒక మంత్రికి, ఎమ్మెల్యేకు, ఎమ్మెల్సీకి చేరిపోతాయి. వెంటనే వారి నుంచి ఈఓకు ఆదేశాలు అందుతాయి. లడ్డూ ప్రసాదాల రేట్లు పెంచుతూ పాలకమండలి తీసుకున్న నిర్ణయాలను ఓ మంత్రి ఆదేశాల మేరకు తగ్గించారు. అధికార పార్టీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు తరుచుగా ఈఓలకు ఏదోఒక సిఫార్సు చేస్తూనే ఉంటారని సమాచారం. కొత్తగా వచ్చే ఈఓ వీటన్నింటినీ తట్టుకుని ఆలయ అభివృద్ధిపై దృష్టి సారించాల్సి ఉంటుంది. పాలకమండలిలో కొందరు సభ్యులు అత్యుత్సాహంతో అధికారులకు ఆదేశాలు ఇస్తూ, పాటించకుంటే ఆగ్రహం వ్యక్తంచేస్తుంటారు.
భక్తులకు సౌకర్యాలు నిల్
రాష్ట్రంలో రెండో అతి పెద్ద ఆలయమైనప్పటికీ భక్తులకు కనీస సౌకర్యాలు లేవు. ఒకటి రెండు రోజులు అమ్మవారి సన్నిధిలో ఉండేందుకు కాటేజీలు అసలే లేవు. ఘాట్ రోడ్డును తరుచు మూసివేస్తూ ఉం టారు. లిప్టులు ఉన్నా.. సామాన్య భక్తులకు అందుబాటులో ఉండవు. దీంతో ఏడంతస్తులూ ఎక్కి అమ్మవారిని దర్శనం చేసుకోవాల్సిందే. అన్నదానం కోసం గంటలుతరబడి వేచి ఉండాలి. వారాంతంలోనూ,
పర్వదినాల్లో ప్రసాదాలు
అం తంత మాత్రంగానే లభిస్తాయి. దసరా ఉత్సవాలు, భవానీదీక్షలప్పుడు కనీసం నాలుగు కిలో మీటర్ల దూరం నడిస్తే కానీ అమ్మవారి దర్శన భాగ్యం కలగదు. భక్తులకు వాహనాల పార్కింగ్ కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఈ సమస్యలను పరిష్కరిస్తే దేవస్థానానికి వచ్చే భక్తుల సంఖ్య పెరిగి మరింత ఆదాయం సమకూరే అవకాశం ఉంటుందన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment