సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ సత్యనారాయణ
కర్నూలు(హాస్పిటల్): ఆసుపత్రులకు చికిత్స కోసం వచ్చే రోగులకు వైద్యులు అనవసర పరీక్షలు చేయించొద్దని జిల్లా కలెక్టర్ ఎస్. సత్యనారాయణ ఆదేశించారు. బస్టాండ్ పరిసరాల్లో ఉన్న ఓ ఆసుపత్రిలో ఇటీవల పరీక్షలకే రూ.15లక్షల బిల్లు వేశారని ఫిర్యాదు వచ్చిందన్నారు. ఇలా రోగుల నుంచి డబ్బులు వసూలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. బుధవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ప్రైవేటు నర్సింగ్ హోమ్‌ల యజమానులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రోగులకు మానవతా దృక్పథంతో వైద్యం అందించాలన్నారు. నర్సింగ్ హోమ్‌లలో పనిచేస్తున్న వైద్యుల జాబితాను 15 రోజులకు ఒకసారి డీఎంహెచ్‌ఓకు పంపించాలని ఆదేశించారు. లింగనిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆసుపత్రుల్లో, స్కానింగ్ కేంద్రాల్లో సేవల ధరలు, వైద్యుల ధ్రువీకరణ పత్రాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. సమావేశంలో డీఎంహెచ్‌ఓ డాక్టర్ వై. నరసింహులు, ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్, ప్రైవేటు నర్సింగ్ హోమ్‌ల యజమానులు, వైద్యులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment