కర్నూలు జిల్లా నుంచి తొలిసారి... అధ్యక్షా | First Time Mlas From Kurnool District | Sakshi
Sakshi News home page

కర్నూలు జిల్లా నుంచి తొలిసారి... అధ్యక్షా

Published Wed, Jun 12 2019 9:45 AM | Last Updated on Wed, Jun 12 2019 10:44 AM

First Time Mla's From Kurnool District - Sakshi

సాక్షి, కర్నూలు:  ఇటీవలి ఎన్నికల్లో జిల్లాలో విజయకేతనం ఎగురవేసిన 14 మంది వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు ఎన్నికైన తర్వాత మొదటిసారిగా నేడు అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకరు ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. జిల్లా నుంచి ఎన్నికైన 14 మంది ఎమ్మెల్యేల్లో ఏకంగా ఆరుగురు మొదటిసారి సభలో అడుగుపెడుతున్నారు. గతంలో ఎమ్మెల్సీగా ఉన్న శిల్పా చక్రపాణిరెడ్డి ఎమ్మెల్యే హోదాలో మొదటిసారే అసెంబ్లీలో అడుగుపెడుతుండడం గమనార్హం.

ఇక కాటసాని రాంభూపాల్‌రెడ్డి ఏకంగా ఆరోసారి ఎమ్మెల్యేగా గెలిచి రికార్డు  సృష్టించి సభకు వెళుతున్నారు. మంత్రులుగా నియమితులైన బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డితో పాటు గుమ్మనూరు జయరాం ఇద్దరూ రెండోసారి సభలో అడుగుపెడుతుండటం గమనార్హం. ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్‌ రెడ్డి, మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి ముచ్చటగా మూడోసారి అసెంబ్లీలో  గళం వినిపించనున్నారు. బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి రెండోసారి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జిల్లాలోని మొత్తం 14 అసెంబ్లీ సీట్లనూ గెలుచుకుని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ క్లీన్‌స్వీప్‌ చేసింది. అసెంబ్లీలో నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న జిల్లా ఎమ్మెల్యేలంతా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన వారే కావడం చరిత్రలోనే ప్రథమం. నూతన ఎమ్మెల్యేలు జిల్లా అభివృద్ధి కోసం గళం వినిపించాలని ప్రజలు కోరుతున్నారు.
 
మొదటిసారి వీరే... 
జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో కొత్తగా ఎమ్మెల్యేగా (గతంలో ఎమ్మెల్సీగా ఎన్నికైన శిల్పా చక్రపాణిరెడ్డిని కలుపుకుని) ఏకంగా ఏడుగురు ఎన్నికయ్యారు. అంటే సగం మంది మొదటిసారిగా శాసనసభలో తమ గళాన్ని వినిపించనున్నారన్నమాట. శ్రీశైలం నియోజకవర్గం నుంచి శిల్పా చక్రపాణిరెడ్డి ఎమ్మెల్యేగా మొదటిసారి ఎన్నికైనప్పటికీ గతంలో ఈయన రెండు దఫాలు ఎమ్మెల్సీగా చేశారు. ఎమ్మెల్సీ కావడంతో  కేవలం శాసనమండలికే పరిమితమయ్యారు. శాసనసభలో మాత్రం మొదటిసారి అడుగుపెడుతున్నట్టే. ఇక కర్నూలు నుంచి హఫీజ్‌ఖాన్, కోడుమూరు నుంచి సుధాకర్, పత్తికొండ నుంచి శ్రీదేవి, నంద్యాల నుంచి శిల్పా రవి, ఆళ్లగడ్డ నుంచి గంగుల నాని, నందికొట్కూరు నుంచి ఆర్థర్‌ మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
 
గళమెత్తండి..
జిల్లాలో అనేక సమస్యలు ఉన్నాయి.  కర్నూలుకు రెండో సమ్మర్‌ స్టోరేజీ ట్యాంకు, రక్షణగోడ నిర్మాణం, జిల్లా ఆసుపత్రి స్థాయి పెంపు, గుండ్రేవుల, వేదావతి ప్రాజెక్టుల నిర్మాణం, కేసీ కెనాల్‌ కింద ఆయకట్టు మొత్తానికి నీరు అందించడం, ముచ్చుమర్రి పూర్తి వంటివి ప్రధానమైనవి. ఎల్‌ఎల్‌సీ కింద కూడా చివరి ఆయకట్టు వరకూ నీరందించాల్సిన అవసరం ఉంది. జిల్లా పశ్చిమ ప్రాంతంలో వలసలు ఎక్కువగా ఉన్నాయి. తాగునీటి సమస్య కూడా అధికం. ఈ సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యేలు గళమెత్తాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. మొత్తం మీద ఈ ఎన్నికల్లో గెలిచిన తర్వాత అసెంబ్లీలో మొదటిసారి అడుగుపెడుతున్న ఎమ్మెల్యేలందరికీ ఆల్‌ ద బెస్ట్‌!  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement