ప్రతీకాత్మక చిత్రం
ప్రేమ.. ఇదిప్పుడు రెండు అక్షరాల కలయిక మాత్రమే కాదు..వేల కోట్ల రూపాయల బిజినెస్ ఐడియా కూడా! అందుకే కొన్ని వ్యాపార సంస్థలు ప్రేమను క్యాష్ చేసుకుంటున్నాయి. తమ రంగురంగుల ప్రకటనలతో ప్రేమ జంటల్ని ఆకర్షించి సొమ్మ చేసుకుంటున్నాయి. కొత్తకొత్త ఆఫర్లతో.. సరికొత్త ఆలోచనలతో తమ బిజినెస్‌ను మూడు చాక్లెట్లు, ఆరు టెడ్డీబేర్లలా కొనసాగిస్తున్నాయి. అందుకే ప్రపంచవ్యాప్తంగా వాలెంటైన్స్ డే సేల్స్ మానియా కొనసాగుతోంది. 2019 లెక్కల ప్రకారం వాలెంటైన్స్ డే సందర్భంగా దేశవ్యాప్తంగా 30వేల కోట్ల రూపాయల బిజినెస్ జరిగిందని అంచనా. అమెరికా వంటి సంపన్న దేశం ఆ ఒక్కరోజే ఖర్చు చేసిన మొత్తం 20.7 బిలియన్ డాలర్లు. సగటున ఒక్కో అమెరికన్ ప్రేమ కానుకల కోసం 200 డాలర్లు(రూ.14వేలు)ఖర్చు చేసినట్లు ఓ సర్వే తెలిపింది. ఆడ,మగ తేడా లేకుండా ఇష్టమైన వారిని కానుకలతో ఇంప్రెస్ చేయాలని చూస్తుండటంతో ప్రతీ సంవత్సరం వాలెంటైన్స్ డే వ్యాపారం ఊపందుకుంటోంది.
డిమాండ్ ఉన్నవి ఇవే!
వాలెంటైన్స్ డే సందర్భంగా ఎక్కువ మొత్తం డబ్బు ఖర్చు చేసిన బహుమతుల్లో క్యాండీలు మొదటి స్థానాన్ని ఆక్రమించాయి. వీటి కోసం చేసిన ఖర్చు మొత్తం దాదాపు 2.4 బిలియన్ డాలర్లు. దాని తర్వాతి స్థానాల్లో వరుసగా చాక్లెట్లు, గ్రీటింగ్ కార్డ్స్ హాలిడే స్పాట్స్, పువ్వులు, నగలు ఉన్నాయి. బ్రాండెడ్ బట్టలు, బొమ్మలు, సిల్వర్ కప్లింగ్స్, పట్టు టైలు, లెదర్ బెల్టులు, వాలెట్స్, కీచైన్లు, డైమెండ్ జ్యుయెలరీ, రిస్ట్‌వాచ్‌లు, స్మార్ట్ ఫోన్‌లు, బ్రాండెడ్ చెప్పులు, హ్యాండ్ బ్యాగ్స్ వంటి వస్తువులు వాటి తర్వాతి స్థానంలో ఉన్నాయి.
ఎర్ర గులాబీల రూటే వేరు..
వాలెంటైన్స్ డే రోజు ఎన్ని వెరైటీ గిఫ్ట్స్ వరుసలో ఉన్నా గులాబీ ప్రత్యేకత వేరు. మనం ఇచ్చే గిఫ్ట్ ఎంత ఖరీదైనా గులాబీ తోడులేకుంటే అది వెలవెలబోతుంది. అందుకే ప్రేమకుల రోజున గులాబీలు నిచ్చెనెక్కెస్తున్నాయి. ఫిబ్రవరి నెలలో గులాబీల ధర మామూలు కంటే పదిరెట్లు ఎక్కువగా ఉంటోంది. ప్రేమికుల రోజున ఒక్కో గులాబీ ధర దాదాపు రూ. 150 నుంచి రూ. 200లకు చేరుతోంది. అంతేకాకుండా మన గులాబీలు చూడటానికి ఎంతో అందంగా ఉండటంతో ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ అధికంగా ఉంది. యూకేలో మన గులాబీల డిమాండ్ గురించయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మలేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జపాన్‌లు మన గులాబీలను ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నాయి. తెలంగాణ, మహారాష్ట్రలు గులాబీలను ఎగుమతి చేసే రాష్ట్రాలుగా అగ్ర స్థానంలో ఉన్నాయి. గత సంవత్సరం 30 కోట్ల రూపాయల విలువైన గులాబీలు ఇతర దేశాలకు ఎగుమతయ్యాయి.
మగాళ్లే ఎక్కువ..
వాలెంటైన్స్ డే కోసం ఆసక్తిగా ఎదురుచూసేది మగవారే! అందుకే ఆ రోజున ఆడవాళ్ల కంటే ఎక్కువగా డబ్బులను ఖర్చుపెట్టేస్తున్నారు. ఓ సర్వే ప్రకారం ఓ మగాడు తన భాగస్వామి కోసం దాదాపు 300 డాలర్లు ఖర్చు చేస్తున్నాడని తేలింది. ఇక ఆడవారు మాత్రం కేవలం 63 డాలర్లకే పరిమితమయ్యారు. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే! రెండు సంవత్సరాలకంటే ఎక్కువ కాలం కలిసున్న జంట మాత్రమే ఒకరిపై ఒకరు ఎక్కువ మొత్తం ఖర్చు చేయటానికి ఆసక్తి చూపిస్తున్నారు.
ఎనిమిది రోజుల ప్రేమ పండుగ
వాలెంటైన్స్ డే ఫిబ్రవరి 14కు మాత్రమే పరిమితం కాలేదు. అంతకు ఏడు రోజుల ముందు నుంచే వాలెంటైన్స్ వీక్ పేరిట సంబరాలు మొదలవుతాయి. ఫిబ్రవరి 7నుంచి ఫిబ్రవరి 14 వరకు మొత్తం ఎనిమిది రోజుల పాటు ఈ సందడి ఉంటుంది. ఈ వారంలోని ఒక్కోరోజుకు ఒక్కో ప్రత్యేకత ఉంది. ప్రేమికులు సైతం ఒక్కోరోజు ఒక్కోవిధంగా తమ ప్రేమను ఎదుటి వ్యక్తికి తెలియజేస్తారు. కానుకల రూపంలో ఒకరినొకరు పలకరించుకుంటారు. వాలెంటైన్స్ డే వ్యాపారానికి ఈ ఏడు రోజులు ఎంతో ఉపకరిస్తున్నాయన్నది నిర్వివాదాంశం.
Comments
Please login to add a commentAdd a comment