కొత్తకోట ఆలయంలో హుండీలను పగులగొట్టి బయట పడేసిన దుండగులు,
సాక్షి, వనపర్తి క్రైం: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో నెలరోజులుగా దొంగలు హల్‌చల్ చేస్తున్నారు. వ్యాపార దుకాణాలు, ఆలయాలు, ఇళ్లు తేడా లేకుండా వరుస చోరీలకు పాల్పడుతూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు. ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ప్రెండ్లీ పోలీసింగ్ పేరుతో ప్రజలకు దగ్గరవుతున్న పోలీస్ యంత్రాంగం చోరీల విషయంలో ఎలాంటి పురోగతి సాధించకపోవడంతో రోజురోజుకు వారిపై ప్రజలకున్న నమ్మకం సన్నగిల్లుతోంది. చోరీల పర్వం ఇలాగే సాగితే.. పోలీస్ శాఖపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉంది.
దొంగతనం జరిగినప్పుడే హడావుడి..
దొంగతనం జరిగినప్పుడే క్లూస్ టీం, ఇతర పోలీస్ అధికారులు హడావుడి చేయడం, ఆ తర్వాత ఆ ఊసే మరిచిపోవడంతో చోరీలు యధావిధిగా కొనసాగుతున్నాయి. తరుచూ జరుగుతున్న దొంగతనాలను చేధించడంలో పోలీసులు విఫలమవుతున్నారన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. చిన్న చిన్న చోరీలను పోలీసులు నామమాత్రంగా వదిలేస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నా.. దొంగతనాలు మాత్రం ఆగడం లేదు. రాత్రివేళలోనే కాకుండా పట్టపగలే చోరీలకు పాల్పడుతూ ఆనవాళ్లు దొరకకుండా విజృంభిస్తున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో నిత్యం ఏదో ఒకచోట దొంగతనం జరుగుతూనే ఉంది. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. చోరీలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారిస్తే అరికట్టవచ్చని ప్రజలు అంటున్నారు.
దేవాలయాల్లో..
చోరీలకు అలవాటుపడిన కొందరు దేవాలయాలను కూడా వదలడంలేదు. ఆలయాల్లోకి చొరబడి మరీ హుండీలను పగలగొట్టి చోరీలకు పాల్పడుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని పలు దేవాలయాల్లో వరుస హుండీల దొంగతనాలు పోలీసులకు సవాల్‌గా మారింది. ఫిబ్రవరి 27 వనపర్తి మండలం నాగవరం కోదండరామస్వామి ఆలయం, రాజనగరం అయ్యప్ప దేవాలయంలో గుర్తుతెలియని దుండగులు ఆలయంలోని హుండీలను పగులగొట్టి నగదును ఎత్తికెళ్లారు. ఈ నెల 1న అర్ధరాత్రి చిన్నచింతకుంట మండలం కురుమూర్తిస్వామి ఆలయంలో హుండీని పగులగొట్టి నగదును దోచుకెళ్లారు. మంగళవారం కొత్తకోట మండల శివారులోని వెంకటగిరి, పట్టణంలోని సాయిబాబ, కోట్ల ఆంజనేయస్వామి ఆలయాల్లో హుండీలను పగులగొట్టి నగదును ఎత్తుకెళ్లారు. అదేవిధంగా వెంకటగిరి ఆలయంలో శఠగోపంతోపాటు తీర్థం పోసే పాత్ర ఎత్తుకెళ్లారు. ఆలయాల్లో జరుగుతున్న వరుస హుండీల చోరీలతో ప్రజల్లో తీవ్ర భయాందోళన వ్యక్తమవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment