సాక్షి, సిటీబ్యూరో: కొత్తమోడల్ వాహనాలు మార్కెట్‌లోకి వస్తున్నప్పుడు పాతవాహనాల అమ్మకాలను పెంచుకునేందుకు డీలర్లు సైతం కొద్దో గొప్పో డిస్కౌంట్‌లు ప్రకటిస్తారు. మార్కెట్‌లోని అన్ని వస్తువుల అమ్మకాల తరహాలోనే ఆటోమొబైల్ రంగంలోనూ ఇలాంటి రాయితీలు సర్వ సాధారణం. అయితే ఈ రాయితీలే ఆటోమొబైల్ రంగానికి గుదిబండలుగా మారాయి. ప్రభుత్వానికి జీవితకాల పన్నుపైన ఆదాయానికి గండి పడుతుందంటూ డిస్కౌంట్‌లతో కూడిన ఇన్‌వాయీస్‌లను స్వీకరించేందుకు రవాణాశాఖ నిరాకరిస్తుండగా, షౌరూమ్‌లు ఇచ్చే ఇన్‌వాయీస్‌లనే ప్రామాణికంగా తీసుకొని వాహనాలను రిజిస్ట్రేషన్ చేయాలని ఆటోమొబైల్ డీలర్లు పేర్కొంటున్నారు. దీంతో నగరంలో డిస్కౌంట్ సేల్స్ వివాదాస్పదంగా మారింది. మరోవైపు ఇదే అంశంపై కొందరు వ్యక్తులు షౌరూమ్‌లు ఇచ్చే ఇన్‌వాయీస్‌లనే ప్రామాణికంగా తీసుకొని వాహనాలను రిజిస్ట్రేషన్ చేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. వాహన తయారీదారులు నిర్ణయించిన వాస్తవ ధర (ఎక్స్‌షోరూమ్ ప్రైస్) ప్రకారమే జీవితకాలపన్ను చెల్లించాలని రవాణాశాఖ వాదిస్తోంది. ఇదే అంశంపైన ఇటీవల ఆర్టీఏ ప్రధాన కార్యాలయంలో డీలర్లు, రవాణా అధికారుల మధ్య చర్చలు జరిగాయి. వివరాల్లోకి వెళితే.గ్రేటర్ పరిధిలో సుమారు 200 మంది ఆటోమొబైల్ డీలర్లు, మరో వంద మందికి పైగా సబ్ డీలర్లు నగరంలో ప్రతి రోజూ 2000 నుంచి 3000 వరకు వాహనాలను విక్రయిస్తారు.
ఇందులో 70 శాతం వరకు బైక్‌లు ఉండగా, మరో 15 శాతం వరకు కార్లు, 5 శాతం లగ్జరీ వాహనాలు, మిగతా 5 శాతం ఇత ర వాహనాలు ఉంటాయి. ఆటోమొబైల్ డీలర్ల మధ్య ఉండే సహజమైన పోటీ వాతావరణం, అమ్మకాలను పెంచుకునేందుకు వినియోగదారులను ఆకట్టుకొనే చర్యల్లో భాగంగా డీలర్లు వాహనాల వాస్తవ ధర (ఎక్స్‌షోరూమ్ ప్రైస్)పైన ఎంతో కొంత డిస్కౌంట్ ఇస్తున్నారు. ఉదాహరణకు మారుతీ స్విఫ్ట్ వాస్తవ ధర రూ.10.25 లక్షలు ఉండగా, డీలర్లు దానిని రూ.9.9 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు విక్రయిస్తున్నారు. వారు విక్రయించిన మేరకే ఇన్‌వాయీస్‌లు ఇస్తున్నారు.అంటే ఒక వాహ నంపైన రూ.25 వేల నుంచి రూ.30 వేల వర కు రాయితీ లభిస్తుంది. ఇక్కడే వివాదం నెల కొంటోంది. రూ.10 లక్షల లోపు ఖరీదైన వాహనాలపైన 12 శాతం చొప్పున, రూ.10 లక్షలు దాటిన వాటిపైన 14 శాతం చొప్పున పన్ను వసూలు చేస్తున్నారు.
అంటే డీలర్లు ఇచ్చే డిస్కౌంట్ కారణంగా ఒక వాహనంపైన ఆర్టీఏ ఆదాయం ఏకంగా 2 శాతానికి పడిపోతోంది. దీనిని దృష్టిలో ఉంచుకొని ఎక్స్‌షోరూమ్ ప్రైస్ ప్రకామే అధికారులు పన్నులు వసూలు చేస్తున్నారు. గత సంవత్సరం నగరంలోని వివిధ ఆర్టీఏ కార్యాలయాల పరిధిలో సుమారు రూ.17 కోట్లు ఇలా అదనంగా రాబట్టారు. డిస్కౌంట్ ధరలపై డీలర్లు ఇచ్చే ఇన్‌వాయీస్ ఆధారంగా వాహనాల రిజిస్ట్రేషన్‌లకు వచ్చే వినియోగదారులపైన అదనపు భారం పడుతోంది. రూ.10.25 లక్షల వాహనాన్ని రూ.9.9 లక్షలకే కొనుగోలు చేసిన వ్యక్తి రవాణాశాఖ నిబంధనల మేరకు అసలు ధర ప్రకారమే పన్ను చెల్లించాల్సి వస్తుండటంతో ఆటోమొబైల్ డీలర్లు దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇదే అంశంపై కొందరు హైకోర్టును సైతం ఆశ్రయించారు.
ఇన్‌వాయీస్ ప్రామాణికం....
వస్తువుకు విక్రయించిన ధరనే ప్రామాణికంగా తీసుకోవాలని డీలర్లు పట్టుబడుతున్నారు. ఇన్‌వాయీస్‌నే ప్రామాణికంగా భావించాలని డిమాండ్ చేస్తున్నారు. విక్రేతలు, కొనుగోలుదారులకు మధ్య జోక్యం తగదన్నారు. మంగళవారం రవాణాశాఖ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలోనూ ఇదే అంశంపైన కొందరు డీలర్లు అధికారులను ప్రశ్నించారు. తమ వస్తువులను ఎంతకైనా విక్రయించే హక్కు తమకు ఉందని, తాము విక్రయించిన ధరల ప్రకారమే జీవితకాల పన్నులు వసూలు చేయాలని డిమాండ్ చేశారు. ‘‘ ఎక్స్‌షోరూమ్ ధరల ప్రకారం పన్నులు వసూలు చేయడం వల్ల అంతిమంగా వినియోగదారుడు తనకు లభించే రాయితీని కోల్పోవలసి వస్తోంది. ప్రభుత్వం వినియోగదారుల ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకోవచ్చు కదా..’’ అని పలువురు డీలర్లు అభిప్రాయపడ్డారు. మరోవైపు భవిష్యత్తులో ఇన్‌వాయీస్‌ల స్థానంలో ఎక్స్‌షోరూమ్ ధరలను మాత్రమే పరిగణనలోకి తీసుకొనేలా నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ (ఎన్‌ఐసీ)తో అనుసంధానమయ్యేందుకు రవాణాశాఖ సన్నాహాలు చేపట్టింది. త్వరలోనే ఇది కార్యరూపం దాల్చనుంది. దాంతో వాహనాల పైన వినియోగదారులకు లభించే డిస్కౌంట్‌లు నిలిచిపోయే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment