సన్నీ లియోన్ పాట ఓ స్పెషల్
‘‘‘దేనికైనా రెడీ’ సినిమా సమయంలో దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డికి పని పట్ల ఉన్న అంకితభావాన్ని చూశాను. ‘కరెంట్ తీగ’లో నన్ను హై రేంజ్‌లో చూపించాడు. ఇప్పటివరకూ నేను చేసిన సినిమాలన్నీ ఓ ఎత్తు. ‘కరెంట్ తీగ’ మరో ఎత్తు’’ అని మంచు మనోజ్ అన్నారు. ఆయన కథానాయకునిగా, మోహన్‌బాబు సమర్పణలో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో మంచు విష్ణు నిర్మించిన చిత్రం ‘కరెంట్ తీగ’. రకుల్ ప్రీత్‌సింగ్ కథానాయిక. జగపతిబాబు కీలక పాత్రధారి. ఇందులో సన్నీలియోన్ ప్రత్యేక గీతంలో అభినయించిన విషయం తెలిసిందే. ఆమెకు బాలీవుడ్‌లో ఉన్న క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకొని ఆ గీతం హిందీ వెర్షన్‌ని హైదరాబాద్‌లో విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మనోజ్ మాట్లాడుతూ ‘‘సంగీత దర్శకుడు అచ్చుతో నా మూడో సినిమా ఇది. వరుసగా మూడు మ్యూజికల్ హిట్స్ ఇచ్చిన అచ్చుకు థ్యాంక్స్. జగపతిబాబుగారి పాత్ర ఈ చిత్రానికి వెన్నెముక. సన్నీలియోన్ ఎంతో రెస్పెక్ట్‌గా వచ్చి మా సినిమాలో నటించారు. ఆమె పాట చిత్రానికే హైలైట్’’అని తెలిపారు. దర్శకుడు నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ -‘‘నా సినిమాలన్నీ మ్యూజికల్ హిట్సే. అలాగే మనోజ్ సినిమాలు కూడా. మేమిద్దరం కలిసి పనిచేసిన ఈ సినిమా పాటలు కూడా అద్భుతంగా కుదిరాయి. మోహన్‌బాబు, విష్ణు సహకారం వల్లే ఈ సినిమా ఇంత బాగా వచ్చింది. కొంతమంది ప్రముఖ దర్శకులు ఈ సినిమా చూసి పెద్ద హిట్ అని జోస్యం చెప్పారు. దీపావళి కానుకగా ఈ నెల 17న మా నవ్వుల సీమటపాకాయ్ ‘కరెంట్ తీగ’ రూపంలో పేలబోతోంది’’ అని అన్నారు. ఇందులో విలన్‌గా నటించిన వీరేన్ కూడా మాట్లాడారు.