టైటిల్: జిన్నా
నటీనటులు: మంచు విష్ణు, పాయల్ రాజ్‌పుత్, సన్నీలియోన్, వెన్నెల కిశోర్, సునీల్, నరేశ్, రఘుబాబు, సత్యం రాజేశ్, చమ్మక్ చంద్ర,సద్దాం తదితరులు
నిర్మాణ సంస్థలు: అవా ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ
నిర్మాతలు: మోహన్‌బాబు, మంచు విష్ణు
కథ, స్క్రీన్‌ప్లే: కోన వెంకట్
దర్శకత్వం: ఇషాన్ సూర్య
సంగీతం: అనూప్ రూబెన్స్
సినిమాటోగ్రఫీ: ఛోటా కె. నాయుడు
ఎడిటర్: చోటా కే ప్రసాద్
విడుదల తేది: అక్టోబర్ 21, 2022
మంచు విష్ణు హీరోగా ఇషాన్ సూర్య దర్శకత్వంలో నటించిన సినిమా 'జిన్నా'. అవా ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీలు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో సన్నీలియోన్, పాయల్ రాజ్‌పుత్‌లు హీరోయిన్స్‌గా నటించారు. స్క్రీన్‌ప్లేను స్టార్ రైటర్ కోన వెంకట్ అందించారు. ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా దీపావళి కానుకగా నేడు(అక్టోబర్ 21) విడుదలైంది. కేవలంలో తెలుగులోనే కాకుండా హిందీ, తమిళం, మలయాళ భాషల్లో ఈరోజు విడుదల చేశారు. మరి ఈ సినిమా కథ, కథనాలు ఎలా ఉన్నాయి? ఆడియెన్స్‌ను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో ఓ సారి చూద్దాం.
జిన్నా కథ ఏంటంటే..
గాలి నాగేశ్వర రావు అలియాస్ జిన్నా తన స్నేహితులతో కలిసి టెంట్‌హౌస్ నడుపుతుంటాడు. అప్పుచేసి మరీ టెంట్‌హౌస్ పెడతాడు. అయితే అతను టెంట్‌హస్ వేస్తే పెళ్లిళ్లు ఆగిపోతుంటాయి. ఇంకోవైపు అంతకంతకూ అప్పు పెరిగిపోతుంటుంది. మరోవైపు ఓ గుండా దగ్గర జిన్నా అప్పులు చేయడంతో దాన్ని తిరిగి తీర్చలేక పరారీలో ఉంటాడు. చివరికి ఆ గుండా జిన్నాని పట్టుకొని అప్పు తీర్చడానికి ఓ షరతు పెడతాడు. అదేంటంటే.. తన సోదరిని వివాహం చేసుకుంటే అప్పు మొత్తం తీర్చేసినట్లే అని కండీషన్ పెడతాడు. ఇదే సమయంలో అమెరికా నుంచి వచ్చిన జిన్నా చిన్ననాటి స్నేహితురాలు రేణుక(సన్నీలియోన్)ఊర్లోకి దిగుతుంది.దాంతో జిన్నా పరిస్థితి మారుతుంది. అప్పులు తీరిపోతాయి. ప్రెసిడెంట్ అవ్వాలన్నా జిన్నా కోరిక కూడా తీరబోతుంది. అయితే రేణుకతో పెళ్లికి రెడీ అయిన జిన్నా.. తాను ప్రేమించిన పచ్చళ్ల స్వాతి (పాయల్ రాజ్‌పుత్)తో కలిసి వేసిన పథకం ఏంటి? చివరకు జిన్నా ఎవరిని పెళ్లి చేసుకున్నాడు అన్నదే మిగితా కథ.
ఎవరెలా నటించారంటే..
జిన్నాగా మంచు విష్ణు కామెడీ సన్నివేశాల్లో చాలా బాగా నటించారు. కొన్ని సన్నివేశాలు ఢీ సినిమాను గుర్తుచేస్తాయి.యాక్షన్, కామెడీలో తన స్టైల్లో మెప్పించాడు. పాయల్ రాజ్‌పుత్ చేసిన స్వాతి పాత్ర రొటీన్‌గా అనిపించినా తన అందంతో ఆకట్టుకుంటుంది. సన్నీలియోన్ పాత్ర అందరిని మెస్మరైజ్ చేస్తుంది. కానీ ఇంటర్వెల్ ట్విస్ట్ రివీల్ చేశాక, ఆమె పాత్ర కాస్త తేలిపోయినట్లు అనిపిస్తుంది. మిగతా పాత్రలు పోషించిన సురేశ్, నరేశ్, రఘుబాబు, సునీల్, ‘సత్యం’ రాజేశ్, గౌతంరాజు, చమ్మక్ చంద్ర, ‘వెన్నెల’ కిశోర్, భద్రం తదితరులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు.బిగ్‌బాస్ ఫేమ్ దివి, త్రిపురనేని చిట్టి గెస్ట్ అప్పీరియన్స్‌లో కనిపించారు. చోటా కె. నాయుడు సినిమాటోగ్రఫీ బాగానే ఉంది. అనూప్ రూబెన్స్ సంగీతం ఆకట్టుకుంటుంది.
ఎలా ఉందంటే..జిన్నా కథ మొదటి నుంచి చివరి వరకు ప్రేక్షకులను కట్టిపడేసేంత ఫ్రెష్‌నెస్ ఏమీ లేదు కానీ, కొన్ని కామెడీ సన్నివేశాలు నవ్విస్తాయి. అప్పటిదాకా ఓ కామెడీ, ఓ సాంగ్, ఓ ఫైట్ అన్నట్టుగా పక్కా కమర్షియల్ ఫార్మాట్‌లో సాగుతున్న కథకు ఇంటర్వెల్‌లో అదిరిపోయే ట్విస్ట్ ఎదురవుతుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రం సెకండాఫ్‌పై క్యూరియాసిటీని పెంచింది. సన్నీ లియోన్ తన నటనతో ఆశ్చర్యపరుస్తుంది.
సెకండాఫ్‌ను కొంచెం డిఫరెంట్‌గా డీల్ చేసే ప్రయత్నం చేశారు.వెన్నెల కిషోర్, చమ్మక్ చంద్రల మధ్య వచ్చే కామెడీ సన్నివేశాలు నవ్వు తెప్పిస్తాయి. అయితే కొన్ని బలవంతపు కామెడీ సీన్స్ ఉన్నట్లు అనిపించడంతో కోర్ ఎమోషన్ సరిగ్గా పండలేదు.ఇందులో మంచు విష్ణు వేసిన డైలాగ్స్ కొన్ని ట్రోలర్లకు కౌంటర్లుగా అనిపించింది. నన్ను ట్రోల్ చేస్తే ఓకే గానీ నా ఫ్యామిలీ జోలికి వస్తే అంటూ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటుంది. సాంకేతికంగా జిన్నా పర్వాలేదనిపిస్తుంది. అనూప్ రూబెన్స్ సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఓకే అనిపిస్తుంది. కెమెరా, ఎడిటింగ్, ఆర్ట్ డిపార్ట్మెంట్ ఇలా అన్నీ కూడా పర్వాలేదనిపిస్తాయి.నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment