
జీఎస్టీతో చిన్న చిత్రాలకు తీరని నష్టం
– టీఎఫ్‌సీసీ అధ్యక్షుడు ఆర్.కె. గౌడ్
‘‘ఫిలిం ఇండస్ట్రీపై కేంద్ర ప్రభుత్వం 28 శాతం జీఎస్‌టీ విధించడం తగదు. దీని ద్వారా సామాన్యులు, మధ్యతరగతి కుటుంబాలకు వినోదం మరింత భారం అవుతుంది’’ అని తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ (టీఎఫ్‌సీసీ) అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్ అన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ – ‘‘ప్రస్తుతం చిన్న సినిమాకు 7 శాతం, పెద్ద సినిమాకు 15 శాతం, డబ్బింగ్ సినిమాకు 20 శాతం పన్ను ఉంది.
ఇప్పుడు అన్నిటికీ 28 శాతం పన్ను విధించడం తగదు. క్లబ్బులు, క్యాసీనోలు, గుర్రపు రేసులకు విధించినట్టు సినిమా ఇండస్ట్రీపై 28 శాతం పన్ను విధించడం వల్ల చిన్న చిత్రాలు తీవ్రంగా నష్టపోతాయి. కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని, 10 శాతం జీఎస్‌టీ చేయాలి. సినిమా టిక్కెట్ రేట్లు పెంచుకోవచ్చని రాష్ట్ర హోమ్ శాఖ ఉత్తర్వులు జారీ చేయడం వల్ల ప్రేక్షకులపై మరింత భారం పడుతుంది. వెంటనే పెంచిన టిక్కెట్ ధరలను తగ్గించాలి. థియేటర్ లీజ్ విధానం, డిజిటల్ దోపిడీ, రూ. 7 మెయింటెనెన్స్ వల్ల చిన్న సినిమాలకు తీరని నష్టం’’ అన్నారు.