సాక్షి, పెరంబూరు: శివాజీగణేశన్ స్మారక మండపాన్ని అక్టోబర్ ఒకటిన ప్రారంభించనున్నట్టు ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. శివాజీగణేశన్ భౌతికంగా లేకపోయినా, సినీ జగం ఉన్నంత కాలం అందులో ఆయన జీవించే ఉంటారు. శివాజీగణేశన్ స్మారక మండపం నెలకొల్పాలన్నది ఆయన అభిమానుల చిరకాల కోరిక. అలాంటి మండపాన్ని దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం నిర్మించాలని భావించినా, అది జరగలేదు.
దివంగత ముఖ్యమంత్రి జయలలిత ప్రభుత్వం శివాజీగణేశన్ కు స్మారక మండపం కట్టించడానికి ముందుకొచ్చింది. స్థానిక అడయారులోని సత్యా స్టూడియో ఎదురుగా 2.80 కోట్లతో గత ఏడారి డిసెంబరులో మండపం నిర్మాణాన్ని ప్రారంభించారు. ఈ ఏడాది మేలో సర్వాంగసుందరంగా స్మారకమండపం పూర్తయ్యింది. స్థానిక మెరీనా తీరంలో శివాజీగణేశన్ శిలావిగ్రహాన్ని తొలగించి అడయారులోని స్మారకమండపంలో ఏర్పాటు చేశారు.
మండపం ప్రారంభం కోసం శివాజీగణేశన్ అభిమానులు వెయ్యి కళ్లతో ఎదరు చూస్తున్నారు. వారికి శుభవార్త ఏమిటంటే శివాజీగణేశన్ 90వ జయంతిని పురస్కరించుకుని అక్టోబరు ఒకటవ తేదీన ఆయన స్మారక మండపం ఆవిష్కరణ కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ మండపాన్ని ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి ప్రారంభించనున్నారు.