2018 : సినిమా సంగతులపై ఓ లుక్కేద్దాం...! | Tollywood And Bollywood 2018 Flashback | Sakshi
Sakshi News home page

Published Thu, Dec 27 2018 3:59 PM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

Tollywood And Bollywood 2018 Flashback - Sakshi

చిన్న సినిమాలు పెద్ద విజయాలు సాధించగా.. పెద్ద సినిమాలు చతికిలపడ్డాయి. బాలీవుడ్‌, టాలీవుడ్‌ అనే తేడా లేకుండా చిన్న సినిమాలు అదరగొట్టాయి. అతిలోక సుందరి శ్రీదేవి, కన్నడ రెబల్‌ స్టార్‌ అంబరీష్‌ మరణం సినీ ఇండస్ట్రీకి చేదు అనుభవాన్ని మిగిల్చాయి. మీటూ ఉద్యమంతో సినీ పరిశ్రమ వేడెక్కింది. కొత్త దర్శకులకు, హీరోయిన్లకు ప్రేక్షకులు రెడ్‌కార్పెట్‌ పరిచారు.. ఈ ఏడాది సినిమా సంగతులపై ఓలుక్కెద్దాం...  

1. ఈ ఏడాది టాలీవుడ్‌ కొత్త దర్శకులకు ఘనంగా స్వాగతం పలికింది. ఛలో(వెంకీ కుడుముల), ఆర్‌ఎక్స్‌ 100(అజయ్‌ భూపతి) లాంటి కమర్షియల్ సినిమాలతో పాటు కేరాఫ్ కంచరపాలెం (వెంకటేష్‌ మహా), చిలసౌ (రాహుల్‌ రవీంద్రన్‌) లాంటి ప్రయోగాత్మక చిత్రాలు చేసిన దర్శకులకు కూడా మంచి విజయాలు దక్కాయి. అ! కమర్షియల్‌గా వర్క్‌ అవుట్ కాకపోయినా ప్రశాంత్ వర్మ టేకింగ్‌కు మాత్రం మంచి రెస్పాన్స్‌ వచ్చింది.

2. 2018లో కొంత మంది క్రేజీ హీరోలు వెండితెరకు ముఖం చాటేశారు. మెగాస్టార్‌ చిరంజీవి, యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌, భల్లాలదేవ రానా, అక్కినేని యువ కథనాయకుడు అఖిల్‌లు ఈ ఏడాది ఒక్క సినిమాను కూడా రిలీజ్ చేయలేదు.

3. ఈ ఏడాది భారతీయ సినీ పరిశ్రమను కుదిపేసిన సంఘటన అతిలోక సుందరి మరణం. దుబాయ్‌లో బందువుల వివాహ వేడుకలకు హజరయ్యేందుకు వెళ్లిన శ్రీదేవి ప్రమాదవశాత్తు బాత్‌టబ్‌లో మునిగి చనిపోయారు. ఈ సంఘటనతో బాలీవుడ్‌తో పాటు యావత్‌ భారతీయ సినీ అభిమానులు శోక సంద్రంలో మునిగిపోయారు.

4. ఈ ఏడాది హిందీ సినీ పరిశ్రమలో పెళ్లి బాజాలు కాస్త గట్టిగానే వినిపించాయి. బాలీవుడ్ టాప్‌ స్టార్స్‌గా కొనసాగుతున్న భామలు పెళ్లి బంధంలో ముడిపడిపోయారు. అంతేకాదు అందరూ ప్రేమ వివాహాలకే ఓటేయడం విశేషం. సోనమ్‌ కపూర్‌.. ఆనంద్‌ అహూజాను, దీపిక పదుకొనే.. రణవీర్‌ సింగ్‌ను, ప్రియాంక చోప్రా.. హాలీవుడ్ గాయకుడు నిక్‌ జోనాస్‌లను పెళ్లి చేసుకున్నారు. ఈ వేడుకలకు మీడియాలోనూ విస్తృతమైన కవరేజ్‌ లభించింది.

5. 2018లో సౌత్‌ ఇండస్ట్రీలోనూ పెళ్లి సందడి బాగానే కనిపించింది. ముఖ్యంగా అందాల నటి శ్రియ వివాహం హాట్ టాపిక్‌గా మారింది. ఎలాంటి ఎనౌన్స్‌మెంట్ లేకుండా మీడియాకు, ఆర్భాటాలకు దూరంగా పెళ్లి చేసుకుంది శ్రియ. ఇక తెలుగింటి అమ్మాయి స్వాతి కూడా తన మనసుకు నచ్చిన వికాస్‌తో ఏడడుగులు నడిచేసింది. వివాదస్పద నటి శ్వేతాబసు ప్రసాద్‌, మలయాళ నటి భావన, తెలుగు, కన్నడ చిత్రాలు చేసిన మదాలస శర్మ కూడా ఈ లిస్ట్‌లో చేరిపోయారు.

6. ఈ ఏడాది టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారిన వ్యక్తి శ్రీ రెడ్డి. సోషల్‌ మీడియా ద్వారా మీటూ పోరాటాన్ని ప్రారంభించిన శ్రీరెడ్డి.. ఫిలిం చాంబర్‌ ముందు అర్ధనగ్న ప్రదర్శనకు దిగటం తీవ్ర దుమారాన్ని రేపింది. తరువాత పవన్‌ను ఉద్దేశిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయటంతో ఈ అంశం మరింత రసాభాసగా మారింది.

7. బాలీవుడ్‌లోనూ మీటూ వివాదం తీవ్ర దుమారం రేపింది. ఇండస్ట్రీలో కాస్టింగ్‌ కౌచ్‌పై చాలా కాలంగా చర్చ నడుస్తున్నా మాజీ నటి తను శ్రీ దత్త ఆరోపణలతో పరిస్థితి మరింత వేడెక్కింది. బాలీవుడ్‌ అగ్రనటుడు నానా పటేకర్‌పై ఆమె ఆరోపణలు చేయటంతో ఆయన పలు ప్రాజెక్ట్‌ల నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తను శ్రీ బాటలో మరింత మంది నటీమణులు దర్శకులు, నటులపై ఆరోపణలకు దిగటంతో బాలీవుడ్‌లో మీటూ వివాదం తారాస్థాయికి చేరింది. 

8. ఈ ఏడాదిలో బాలీవుడ్‌ను కుదిపేసిన మరో అంశం ఇద్దరు తారలు క్యాన్సర్‌ బారిన పడటం. హిందీలో విలక్షణ నటుడిగా ఎన్నో అద్భుతమైన పాత్రల్లో కనిపిస్తున్న ఇర్ఫాన్‌ ఖాన్‌, తను ఓ అరుదైన వ్యాది బారిన పడినట్టుగా ప్రకటించి అందరికీ షాక్‌ ఇచ్చారు. ఈ సంఘటన జరిగిన కొద్ది రోజులకే నటి సోనాలి బ్రిందే కూడా తాను క్యాన్సర్‌తో బాధ పడుతున్నట్టుగా ప్రకటించటంతో అభిమానులు షాక్‌కు గురయ్యారు.

9. 20 సంవత్సరాలుగా సల్మాన్‌ను వెంటాడుతున్న కృష్ణ జింకల కేసులో ఈ ఏడాది తీర్పు వెలువడింది. ఈ కేసులో సల్మాన్‌ ను దోషిగా తేల్చిన కోర్టు ఏప్రిల్‌ 5న ఐదేళ్ల శిక్ష విధిస్తూ తీర్పు నిచ్చింది. వెంటనే ఏప్రిల్‌ 7న సల్మాన్‌ బెయిల్‌ పై విడుదలయ్యారు. ఈ కేసులో సైఫ్‌ అలీఖాన్‌, సొనాలి, నీలమ్‌, టబులను కోర్టు నిర్దోషులుగా తేల్చింది.

10. ఈ ఏడాది సాండల్‌వుడ్‌ను కుదిపేసిన సంఘటన రెబల్‌ స్టార్‌ అంబరీష్ మరణం. కన్నడ నాట స్టార్‌ హీరోగా తిరుగులేని మాస్‌ ఫాలోయింగ్‌ను సాదించిన అంబరీష్‌ ప్రస్తుతం పరిశ్రమకు పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్నారు. రాజకీయాల్లోనూ క్రియాశీల పాత్ర పోషిస్తున్న ఆయన నవంబర్ 24న అనారోగ్య కారణాలతో తుదిశ్వాస విడిచారు.

11. ఈ ఏడాది బాలీవుడ్ వెండితెర మీద కొత్త అందాలు తళుక్కుమన్నాయి. ముఖ్యంగా స్టార్‌ వారసుల ఎంట్రీతో బాలీవుడ్ కళకళలాడింది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్‌ దడక్‌ సినిమాతో ఎంట్రీ ఇవ్వగా.. సైఫ్‌ గారాల పట్టి సారా అలీఖాన్‌ కేదార్‌నాథ్‌ సినిమాతో తెరంగేట్రం చేసింది. షాహిద్‌ సోదరుడు ఇషాన్‌ కట్టర్‌తో పాటు సౌత్ టాప్‌ స్టార్‌ మమ్ముట్టి కుమారుడు దుల్కర్‌ సల్మాన్‌ కూడా బాలీవుడ్‌కు పరిచయమయ్యారు.

12. వెండితెరకు ఎంతో మంది సూపర్‌ హీరోలను పరిచయం చేసిన ప్రముఖ హాలీవుడ్‌ రచయిత స్టాన్‌లీ 95 ఏళ్ల వయసులో నవంబర్‌ 12న కన్నుమూశారు. హాలీవుడ్‌లో స్పైడర్‌ మేన్‌, ది హల్క్‌, థోర్‌, ఐరన్‌ మేన్‌, ఎక్స్‌ మేన్‌, డాక్టర్‌ స్ట్రేంజ్‌ లాంటి సూపర్‌ హీరో పాత్రలను సృష్టించి మార్వెల్‌ సంస్థ ఎదుగుదలకు ఎంతో కృషి చేశారు స్టాన్‌లీ.

13. ఈ ఏడాది టాలీవుడ్ ప్రేక్షకులకు తగిలిన షాక్ అజ్ఞాతవాసి. త్రివిక్రమ్, పవన్‌ కల్యాణ్‌ల కాంబినేషన్‌పై భారీ అంచనాలతో థియేటర్లకు వెళ్లిన అభిమానులను ఈ ఇద్దరు తీవ్రంగా నిరాశపరిచారు. ఈ సినిమాతో త్రివిక్రమ్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వెళ్లువెత్త్తాయి. నా పేరు సూర్యతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అల్లు అర్జున్‌ కూడా అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాడు.

14. బాహుబలి 2ను మించి భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన థగ్స్‌ ఆఫ్‌ హిందుస్థాన్, 2.ఓ సినిమాలు ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే వీటిలో థగ్స్‌ ఆఫ్‌ హిందుస్థాన్‌కు ఫ్లాప్‌ టాక్‌ రాగా.. 2.ఓ కు డివైడ్‌ టాక్‌ వచ్చింది. ఎన్నో వివాదాలకు కారణమైన మరో భారీ బడ్జెట్‌ సినిమా పద్మావత్‌ కూడా ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

15. 2018 టాలీవుడ్‌ లో డెబ్యూ హీరోయిన్లకు చాలా బాగా కలిసొచ్చింది. ఈ ఏడాది ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మలు తొలి సినిమాతోనే స్టార్‌ లీగ్‌లో చేరిపోయారు. భరత్‌ అనే నేను తో కియారా అద్వానీ, ఛలో తో రష్మిక మందన్న, సమ్మోహనంతో అదితిరావ్‌ హైదరీ, ఆర్‌ఎక్స్‌ 100తో పాయల్‌ రాజ్‌పుత్‌లు టాలీవుడ్ హాట్‌ ఫేవరెట్స్‌గా మారిపోయారు.

16. ఈ ఏడాది చిన్న సినిమాలు సంచలన విజయాలు నమోదు చేశాయి. బాండ్ తరహా కథాంశంతో వచ్చిన గూడచారి, సందేశాత్మకంగా తెరకెక్కిన నీది నాది ఒకే కథ, ప్రయోగాత్మక చిత్రం కేరాఫ్ కంచరపాలెంతో పాటు కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లుగా తెరకెక్కిన ఛలో, తొలిప్రేమ, గీత గోవిందం కూడా చిన్న సినిమాలుగా విడుదలై విమర్శకుల ప్రశంసలతో పాటు మంచి వసూళ్లు సాదించాయి.

17. ఈ ఏడాది టాలీవుడ్ నటులు ప్రయెగాలకు ఓటేశారు. రొటీన్‌ కమర్షియల్ ఫార్ములాను పక్కన పెట్టి కొత్త కథలను ఎంచుకున్నారు. నోటా లాంటి పొలిటికల్‌ థ్రిల్లర్‌తో విజయ్‌ దేవరకొండ, రామ్‌ చరణ్‌ పీరియాడిక్‌ జానర్‌లో తెరకెక్కిన రంగస్థలంతో, మహేష్‌ పొలిటికల్‌ డ్రామాగా తెరకెక్కిన భరత్‌ అనే నేనుతో, సుమంత్‌ మిస్టరీ థ్రిల్లర్‌గా సుబ్రహ్మణ్యపురం సినిమాలతో అలరించారు. హీరోయిన్ సమంత కూడా తొలిసారిగా యు టర్న్‌ సినిమాతో లేడీ ఓరియంటెడ్‌ సినిమాల ట్రెండ్‌లోకి అడుగుపెట్టింది.

18. ఈ ఏడాది బాలీవుడ్‌ ఖాన్‌లకు ఏమాత్రం కలిసిరాలేదు. బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ ఈ ఏడాది బాక్సాఫీస్‌ వద్ద బోల్తాపడ్డాడు. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన రేస్‌3 ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఇక ఆమిర్‌ఖాన్‌ థగ్స్‌ ఆఫ్‌ హిందుస్తాన్‌ భారీ హైప్‌ను క్రియేట్‌చేయగా.. ఈ ఏడాది బాలీవుడ్‌ డిజాస్టర్‌గా నిలిచింది. బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌ గత కొంత కాలంపాటు సరైన విజయం లేక ఈ ఏడాది జీరో లాంటి ప్రయోగంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కానీ అది కూడా మిశ్రమ ఫలితాన్ని మిగిల్చింది. మొత్తంగా ఖాన్‌త్రయానికి ఈ ఏడాది చేదు అనుభవమే మిగిలింది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement