చారన్నంలాంటి సినిమా - త్రివిక్రమ్
‘‘నేను దర్శకుడి కంటే ముందు రచయితను. అంతకంటే ముందు ఓ మధ్య తరగతి మనిషిని. మన ఆలోచనలు గొప్పవైతే గొప్పగా ఎదుగుతాం. తక్కువైతే వెనకబడిపోతాం. ప్రపంచం బాగుండాలంటే ఇద్దరు మనుషులు మనసు విప్పి మాట్లాడుకోవాలి. మామూలు కథను బలంగా చెప్పాలనుకుని ఈ చిత్రం చేశా. బూతులు లేని వినోదం పంచడానికి మొదటి నుంచీ నేను ప్రయత్నిస్తున్నా. అందుకే కొంచెం ఆలస్యమైనా మంచినే చెప్పాలనిపిస్తుంది. బిర్యానీ, మసాలాలు తిన్న మనకు ఫుడ్ పాయిజినింగ్ అయితే డాక్టరు చారన్నం తినమంటాడు.
నా దృష్టిలో ఈ చిత్రం చారన్నంలాంటిది’’ అని దర్శకుడు త్రివిక్రమ్ అన్నారు. నితిన్, సమంత, అనుపమా పరమేశ్వరన్ ముఖ్య తారలుగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎస్.రాధాకృష్ణ (చినబాబు) నిర్మించిన ‘అ..ఆ...’ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ఈ చిత్రం విజయోత్సవాన్ని గుంటూరులో నిర్వహించారు. ఈ సందర్భంగా నితిన్ మాట్లాడుతూ -‘‘ ‘సై’ చిత్రం తర్వాత మళ్లీ ఇప్పుడు గుంటూరుకు వచ్చా. ‘అ.. ఆ’ చిత్రంలో నటించిన ప్రతి ఆర్టిస్ట్‌కు సమానంగా పేరొచ్చింది.
ఈ చిత్రానికి అసలైన హీరో త్రివిక్రమ్‌గారే. ఈ విజయం నాకెంతో కీలకం. ఈ చిత్రాన్ని ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు’’ అని తెలిపారు. ‘‘నితిన్‌ను యాభై కోట్ల క్లబ్‌లోకి తీసుకెళ్లినందుకు త్రివిక్రమ్ గారికి థ్యాంక్స్. నితిన్ టార్గెట్ ఇప్పుడు వంద కోట్లు’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. త్రివిక్రమ్, రాధాకృష్ణ, నిర్మాత సూర్యదేవర నాగవంశీ, ఎగ్జిక్యూటివ్ నిర్మాత పీడీవీ ప్రసాద్ చిత్రబృందానికి, డిస్ట్రిబ్యూటర్లకు షీల్డ్‌లు అందించారు. హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్, నటీనటులు నదియా, హరితేజ, శ్రీనివాసరెడ్డి, అజయ్, మధునందన్, పాటల రచయిత కృష్ణచైతన్య తదితరులు పాల్గొన్నారు.