తోట చక్రవర్తి లాంటి పోలీస్ అధికారి కావాలంటారు
‘‘ ‘బోర్డర్’లో సన్నీడియోల్‌లా, ‘ప్రహార్’లో నానాపటేకర్‌లా, ‘చక్ దే ఇండియా’లో షారుక్‌ఖాన్‌లా ఓ శక్తిమంతమైన పాత్రను ‘ఆ ఐదుగురు’లో పోషిస్తున్నాను. నా పాత్ర పేరు తోట చక్రవర్తి. ఈ సినిమా చూశాక అందరూ ఇలాంటి పోలీస్ అధికారి కావాలంటారు’’ అని వెంకట్ చెప్పారు. అనిల్ గూడూర్ దర్శకత్వంలో ప్రేమ్‌కుమార్ నిర్మిస్తున్న ‘ఆ ఐదుగురు’లో వెంకట్ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా తన కెరీర్‌ని మలుపు తిప్పుతుందనే ఆశాభావంతో ఉన్నారాయన.
నేడు వెంకట్ పుట్టినరోజు. ఈ సంద ర్భంగా వెంకట్ మాట్లాడుతూ -‘‘వైవీయస్ చౌదరికోసం ‘సలీం’లో చేశాను. ఆ తర్వాత మళ్లీ ఏ సినిమా ఒప్పుకోలేదు. పవర్‌ఫుల్ పాత్ర కోసం ఎదురు చూస్తున్న సమయంలో ‘ఆ ఐదుగురు’ అవకాశం వచ్చింది. దర్శకుడు ఎంతో ఇష్టపడి ఈ స్క్రిప్టు చేసుకున్నాడు. ఇక ప్రేమ్‌కుమార్ వండర్‌ఫుల్ ప్రొడ్యూసర్. ఆ నలుగురు, వినాయకుడులాంటి సినిమాలు తీసిన అభిరుచి కలిగిన వ్యక్తి. అలాంటి వారితో పనిచేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు. సహజత్వం కోసం సినిమా షూటింగ్‌లో ఎలాంటి డూప్స్ లేకుండా పోరాటాలు చేయడం వల్ల వీపుకి గాయమై, రెండు నెలలు విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చిందని వెంకట్ తెలిపారు.