నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్‌పై అమెరికా పోలీసుల దమనకాండకు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. సినీ సెలబ్రిటీలు వర్ణ వివక్షను వీడాలంటూ ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. అయితే తారాలోకం అమెరికా నల్లజాతీయులకు అండగా నిలువడంపై ప్రశంసలు కురుస్తున్నా.. మరోవైపు దేశంలో జరుగుతున్న అన్యాయాలపై ప్రశ్నించకుండా ద్వంద ప్రమాణాలు పాటిస్తున్నారంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఇక బాలీవుడ్ నటుడు అభయ్ డియోల్ కూడా హిందీ సినీ తారల ద్వంద ప్రమాణాలపై ప్రశ్నల వర్షం కురిపించారు. ‘మనకు వలస కార్మికుల జీవితాలు కూడా ముఖ్యమే. మైనారిటీల జీవితాలు కూడా అత్యంత ప్రధానం. పేదల జీవితాల గురించి కూడా మనకు పట్టింపు ఉండాలి. ఇప్పుడు మేల్కొన్న భారతీయ సినీ సెలబ్రిటీలు అమెరికాలో జరుగుతున్న జాత్యహంకారానికి వ్యతిరేకంగా మద్దతు తెలుపుతున్నారు. కానీ వారికి వారి సొంత పెరట్లో జరిగే అన్యాయాలు కనబడవు’ అంటూ అభయ్ చురకలు అంటించారు. నెటిజనులు అభయ్‌కు మద్దతు తెలుపుతున్నారు. (‘అల్లర్ల వెనుక అతివాద గ్రూపులు’)
ఇదే కాక ప్రస్తుతం అభయ్ తన సోషల్ మీడియా ఖాతాలు ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో ఫెయిర్‌నెస్ క్రీం ఉత్పత్తులకు వ్యతిరేకంగా ఓ క్యాంపెయిన్ రన్ చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ‘భారతీయ సెలబ్రిటీలు ఇప్పటికైనా ఫెయిర్‌నెస్ క్రీముల ప్రకటనల్లో నటించడం మానేస్తారా’ అంటూ ఓ ప్రశ్నను లేవనెత్తారు. అంతేకాక గత కొన్నేళ్లుగా భారతదేశంలో ఫెయిర్‌నెస్ ఉత్పత్తుల మార్కెట్ ఎలా ఉందో ఉదాహరణలతో సహా పోస్ట్ చేశారు. ఫెయిర్‌నెస్ క్రీమ్‌లకు అంబాసిడర్లుగా నటించిన పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలను అభయ్ విమర్శించారు. ఈ జాబితాలో షారూఖ్ ఖాన్, దీపికా పదుకొనే, సోనమ్ కపూర్ వంటివారు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment