పెళ్లైయినా నటిస్తా!
భర్త కోసమో, అత్త కోసమో నటనను త్యాగం చేయకూడదంటున్నారు నటి శ్రుతిహాసన్. ఈ బ్యూటీ ఎంత బోల్డో ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన మనసుకు అనిపించింది నిర్భయంగా చెప్పేస్తారు. గ్లామరంటే ఏమిటి? పెళ్లి చేసుకోకుండానే పిల్లల్ని కంటాను లాంటి ఏ నటి అనడానికి సాహసించని వ్యాఖ్యలు చేయడం శ్రుతికే సాధ్యం. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో నటిస్తూ బిజీగా ఉన్న శ్రుతిహాసన్ నటుడు సూర్యకు జంటగా నటించిన తాజా చిత్రం సీ–3 ప్రపంచ వ్యాప్తంగా రేపు తెరపైకి రానుంది.
ఈ అమ్మడు ఎప్పుడు భేటీ ఇచ్చినా అది ఆసక్తికరంగానే ఉంటుంది. తన తాజా ఇంటర్వూ్యలోనూ అలాంటి పలు ఆసక్తికరమైన అంశాలు చోటు చేసుకున్నాయి.అవేమిటో చూద్దామా ‘నేను నటిగా రంగప్రవేశం చేసి ఏడేళ్లయ్యింది. ఆరంభ కాలంలో కంటే ఇప్పుడు చాలా పరిణితి చెందాను. చాలెంజింగ్ విషయాలను ధైర్యంగా ఎదుర్కొనే పరిపక్వత చెందాను. పాపులర్ నటిని కావడంతో తలెత్తే విమర్శనలను సాధకంగా మార్చుకోగలుగుతున్నాను.
సక్సెస్ హీరోలకే
సినిమాలు విజయం సాధిస్తే అందుకు హీరోలనే కారణం చేస్తుండడం సహజంగా మారింది. హీరోయిన్లను పట్టించుకోవడం లేదు.అయినా నేనీ విషయం గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు. నా పాత్ర బాగుందా? ఆ పాత్రకు న్యాయం చేశానా అన్న అంశాల గురించే ఆలోచిస్తాను. ఇప్పుడు సినిమాల్లో హీరోయిన్ల పాత్రలకు ప్రాముఖ్యత పెరుగుతోంది. హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రాలు రావడం స్వాగతించదగ్గ విషయం.
నా జోక్యం ఉండదు
నా తండ్రి కమలహాసన్ నుంచి నటి గౌతమి దూరం కావడానికి మీరే కారణమా? అని చాలా మంది అడుగుతున్నారు. నా తండ్రి వ్యక్తిగత జీవితం గురించి నేను బహిరంగంగా మాట్లాడదలచుకోలేదు. ఇతరుల వ్యక్తి గత జీవితాల గురించి మాట్లాడే అలవాటు నాకు లేదు. ఇంకా చెప్పాలంటే ఇలాంటి వివాదాస్పద ప్రశ్నలను ఎలా ఎదుర్కోవాలన్నది నేర్చుకున్నాను. ప్రశంసలను ఆశించకుంటే విమర్శలను, సమస్యలను సులభంగా పరిష్కరించుకోవచ్చు.
పెళ్లెప్పుడంటున్నారు
కథానాయికలు వివాహానంతరం నటనకు దూరం అవుతున్నారు. అది కరెక్ట్ కాదు. నటన వృత్తి లాంటిదే. భర్త చెప్పారనో, అత్త కాదన్నారనో నటనను త్యాగం చేయకూడదన్నది నా అభిప్రాయం. పెళ్లెప్పుడు చేసుకుంటారు. సయమం వచ్చినప్పుడు అదే జరుగుతుంది. పెళ్లి అయ్యి ,తల్లి అయిన తరువాత కూడా నేను నటించాలనుకుంటున్నారు. ఎందుకంటే నటనంటే నాకు చాలా ఇష్టం.