
హీరోయిన్ ప్రేమలో టాలీవుడ్ లవర్ బాయ్
హైదరాబాద్: టాలీవుడ్ లవర్ బాయ్ వరుణ్ సందేశ్ పెళ్లిపీటలు ఎక్కేందుకు సమాయత్తమవుతున్నాడు. హీరోయిన్ వితిక షెరును అతడు పెళ్లాడనున్నాడు. ఈ ఏడాది విడుదలైన 'పడ్డానండి ప్రేమలో మరి' సినిమాలో వీరిద్దరూ కలిసి నటించారు. ఈ సినిమా షూటింగ్ లోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించినట్టు తెలుస్తోంది. వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించినట్టు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.
' తామిద్దరం ప్రేమించుకుంటున్నామని వరుణ్, వితిక తమ తమ కుటుంబాలకు తెలిపారు. దీంతో ఇరు కుటుంబాలు కలుసుకుని మాట్లాడుకున్నాయి. వీరిద్దరికీ పెళ్లి చేసేందుకు అంగీకరించాయ'ని సన్నిహిత వర్గాలు తెలిపాయి. త్వరలోనే వరుణ్, వితిక నిశ్చితార్థం జరిగే అవకాశముందని వెల్లడించాయి. దీనిపై ప్రకటన చేసేందుకు సరైన సమయం కోసం వీరిద్దరూ ఎదురుచూస్తున్నారని పేర్కొన్నాయి. 'హ్యపీడేస్'తో చిత్రరంగ ప్రవేశం చేసిన వరుణ్ సందేశ్.. కొత్తబంగారు లోకం, ఎవరైనా ఎపుడైనా, కుర్రాడు, మరోచరిత్ర, ఏమైంది ఈవేళ, కుదిరితే కప్పు కాఫీ, చమ్మక్ చల్లో, సరదాగా అమ్మాయితో తదితర సినిమాల్లో నటించాడు.