టాలెంట్‌ ఉంటే దాచుకోవద్దు | Actress Bhavana Chit Chat With Sakshi | Sakshi
Sakshi News home page

కళను ప్రదర్శిస్తేనే అవకాశాలు

Published Sat, Jun 15 2019 10:07 AM | Last Updated on Sat, Jun 15 2019 10:07 AM

Actress Bhavana Chit Chat With Sakshi

అనంతపురం కల్చరల్‌: బాలనటిగా హీరోలు సూపర్‌స్టార్‌ కృష్ణ, నటకిరీటి రాజేంద్రప్రసాద్, అర్జున్‌ వంటి వారి సరసన నటించి తర్వాతి కాలంలో హీరోయిన్‌గా కూడా చక్కటి వేషాలు వేసి మెప్పించింది నటి భావన. జిల్లాకు చెందిన ర్యాంబో అస్లాం దర్శకత్వంలో వస్తున్న ఓ లఘు చిత్రంలో నటించడానికి శుక్రవారం ఆమె అనంతపురానికి విచ్చేశారు. ప్రస్తుతం ప్రజాధరణ పొందుతున్న సీరియల్స్‌ కల్యాణ వైభోగం, పౌర్ణమిలలో ప్రధాన పాత్రలు పోషిస్తున్న భావన అనేక స్టేజ్‌ షోలు కూడా చేశారు.  కళ్యాణదుర్గం చుట్టుపక్కల ప్రాంతాలలో జరిగిన షూటింగ్‌లో పాల్గొన్న ఆమె ఈ సందర్భంగా ‘సాక్షి’తో ముచ్చటించారు.  

ఇదే తొలిసారి
అనంతపురం జిల్లాకు రావడం నేనిదే మొదటిసారి. అయితే గతంలో రెండుసార్లు జిల్లా మీదుగా తిరుపతికి వెళ్లినా ఇక్కడకు రాలేకపోయాను. లేపాక్షి, పుట్టపర్తి ప్రాంతాలు చూడమని  చాలా మంది చెప్పేవారు. ఈసారి కూడా చూసే అవకాశం వస్తుందో రాదో కానీ అనంతకు రావడం మాత్రం నాకు ఆనందంగా ఉంది. కళ్యాణదుర్గంలో జరిగే ఓ ప్రాయోజిత కార్యక్రమంలో కూడా పాల్గొంటున్నాను. ఈ సందర్భంగా నరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకోవడం భక్తిభావాన్ని పెంచింది.

బాలనటిగానే ప్రయాణం
నేను మూడేళ్ల వయసు నుండే చిత్రాల్లో నటించే అవకాశం వచ్చింది. హీరో అర్జున్‌ నటించిన కుట్ర సినిమాతో ప్రారంభమైన నా సినీ ప్రయాణం రాజేంద్రప్రసాద్, ఆలీ, చిరంజీవి, శోభన్‌బాబు, కృష్ణ వంటి పెద్ద నటుల వద్ద వాళ్ల కూతురుగా నటించిన నేనే వారి సరసన హీరోయిన్‌గా కూడా చేసే దాకా కొనసాగింది. విజృంభన, లాయర్‌ సుహాసిని, అమ్మాయి బాగుంది,  చిక్కడు–దొరకడు, కన్యాదానం, మానవడు–దానవుడు వంటి సినిమాల్లో నటించాను. అదేవిధంగా తమిళ సినిమాల్లో కూడా జెమినీ గణేశన్, కమలహాసన్‌ వంటి హీరోలతో దేవరమగన్, మహానది సినిమాల్లో నటించాను.

ప్రాధాన్యత ఉంటే ఏ పాత్ర అయినా ఒకే..
చాలా మంది నటీనటులు గిరి గీసుకుని చట్రంలో ఉండిపోవడం వల్ల త్వరగా షేడ్‌అవుట్‌ అయిపోయిన సందర్భాలను చూశాను. అలాగని ప్రాధాన్యత లేని పాత్రల్లో నటించాలని కాదు. నా వరకు నా రోల్‌కు ఇంపార్టెన్స్‌ ఉందంటేనే నటించడానికి ఒప్పుకుంటున్నాను. ఆ క్రమంలో హీరోయిన్‌గానే కాదు ఇతర పాత్రలూ ధరించాల్సి వస్తోంది. అయితేనే ఆ పాత్రలే మలుపు తిప్పేవిగా ఉండాలని నేను భావిస్తాను. ప్రస్తుతం కల్యాణ వైభోగం సీరియల్‌లో యంగ్‌ చార్మింగ్‌ మదర్‌గా నటిస్తున్నాను. ప్రస్తుతం ఇదే ట్రెండ్‌ నడుస్తోంది.

టీవీ క్రేజ్‌ అంతా ఇంతా కాదు
ఈ రోజుల్లో సినిమాలకు, టీవీ షోలు, సీరియల్స్‌ ఆదరణ సమానంగా ఉంటోంది. ఇంకా చెప్పాలంటే టీవీ క్రేజ్‌ ఇంతా అంతా కాదు. నిత్యం ఏదో ఒక చానెల్లో వచ్చే సీరియల్‌లో కనిపిస్తుండడం వల్ల ఇంట్లో సభ్యులుగా మారిపోయాము. నాకు బాగా పేరు తెచ్చిపెట్టిన ‘అందం’ సీరియల్లో నటించిన తర్వాత ఆ పాత్ర పేరుతోనే పిలుస్తున్నారు. కొన్నేళ్ల కిందట రాష్ట్ర ప్రభుత్వం అందించే  నంది అవార్డును కూడాగెలుచుకున్నాను.

టాలెంట్‌ ఉంటే దాచుకోవద్దు
టాలెంట్‌ అనేది భగవంతుడు ఇచ్చిన వరం. అందరికీ సాధ్యం కాని కళలు మనలో ఉన్నప్పుడు వాటిని ప్రదర్శించుకునే అవకాశం కోసం ఎదురు చూడాలి. చాలా మంది యూత్‌ ఒక్కసారిగా పెద్దస్థాయికి వెళ్లిపోదామనుకుంటూ కలలు కంటుంటారు. తప్పులేదు. కానీ అవి నెరవేరకపోతే నిరుత్సాహం పడొద్దు. ఇండస్ట్రీలో ఎంతో మంది నానా అవస్థలు పడి స్టార్‌డమ్‌కు వచ్చారు. ఆ విజయం వెనుక అంతులేని శ్రమ కృషి ఉంటాయి. వాటిని గమనించాలి కానీ పైౖపై మెరుగులను చూసి కాదు. పూర్వంతో పోలిస్తే ఇప్పుడు చాలా మంచి అవకాశాలను టీవీలందిస్తున్నాయి. సక్రమమైన పద్ధతుల్లో రాకపోతే మోసపోయే ప్రమాదముంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement