సినిమా :చేదు అనుభవాలెన్నో చవిచూశాను అంటోంది వర్తమాన నటి ఇందూజా. మేయాదమాన్ చిత్రంలో ఇద్దరుకథానాయికల్లో ఒకరిగా పరిచయమైన ఈ అమ్మడు ఆ తరువాత ప్రభుదేవాతో మెర్కురీ, విక్రమ్‌ప్రభుకు జంటగా 60 వయదు మానిరం, ఆర్‌కే.సురేష్‌తో బిల్లారంగా అంటూ వరుసగా చిత్రాలు చేసేసింది. ప్రస్తుతం అధర్వతో రొమాన్స్ చేసిన బూమరాంగ్ చిత్రం విడుదల కోసం ఎదురు చూస్తోంది. ఈ సందర్భంగా బ్యూటీతో చిన్న భేటీ.
ప్ర: మీ పూర్వీకం?
జ: నేను తమిళ అమ్మాయినే. వేలూరు సమీపంలోని ఓట్టేరి స్వగ్రామం. నాన్న రవిచంద్రన్ వ్యాపారవేత్త. అమ్మ సీత ఆరణిలో స్కూల్ హెడ్‌మాస్టర్‌గా చేసి రిటైర్డ్ అయ్యారు. ఇద్దరు చెల్లెళ్లు. నేను కాట్పాడిలోని వీఐటీలో ఎంఎస్(సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ చదివాను. మూడో సంవత్సరం మానేశాను. కారణం సినిమాపై ఆసక్తే. మొదట్లో పలు లఘు చిత్రాల్లో నటించే అవకాశం వచ్చింది. దీంతో అమ్మానాన్నలు వ్యతిరేకించినా లఘు చిత్రాల్లో నటించాను
ప్ర: సినిమా అవకాశాల కోసం చాలా చేదు అనుభవాలను ఎదుర్కొని ఉంటారే?
జ: మీరే అర్థంతో ఈ ప్రశ్న అడిగారో తెలియదుగానీ, నేనిక్కడ చాలా చేదు అనుభవాలను చవి చూశాను. అయితే మీటూ లాంటివి మాత్రం కాదు. అవకాశాల కోసం వెళ్లినప్పుడు చాలా అవమానాలు ఎదుర్కొన్నాను. అసహ్యానికి గురయ్యాను. ఆడిషన్స్‌కు పిలుస్తారు. కొత్తకొత్త ఫోజుల్లో ఫొటో సెషన్ చేసుకురమ్మంటారు. కొత్తగా పరిచయం అయ్యే వారి వద్ద ఫొటో సెషన్‌కు ఖర్చు చేసేంత డబ్బు ఎక్కడ ఉం టుంది చెప్పండి. ఏదో ఒక ఫొటో చూపించి అవకాశాలు అడిగేదాన్ని. నేనెప్పుడూ పార్టీల కు, పర్సనల్ మీటింగ్ లాంటి వాటికి వెళ్లను. హీరోయిన్ అయిన తరువాత కూడా అలాంటి అలవాటు నాకు లేదు. అందుకే కొందరు నన్ను పొగరుబోతు అని కూడా అంటుంటారు.
ప్ర: ప్రస్తుతం చేస్తున్న చిత్రాలు?
జ: అధర్వతో బూమరాంగ్ చిత్రంలో నటించాను. ఈ చిత్రంలో నా నటనకు మంచి పేరు వస్తుందనే నమ్మకం ఉంది. ప్రస్తుతం సూపర్ డూపర్ అనే చిత్రంలో నటిస్తున్నాను. తమిళంతో పాటు ఇతర భాషల్లోనూ మంచి పాత్రల్లో నటించాలని కోరుకుంటున్నాను. అయితే ఇంకా అలాంటి అవకాశాలు రాలేదు.
ప్ర: చివరి ప్రశ్న. మిమ్మల్ని ప్రభుదేవాతో కలిపి చాలా వదంతులు వస్తున్నాయే?
జ: ప్రభుదేవాతో కలిసి మెర్కురి చిత్రంలో నటించాను. అప్పటి నుంచి ఆయన్ని ప్రేమిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రభుదేవా చేతుల్లో నేను ఉన్నట్లు వదంతులు ప్రచారం అవుతున్నాయి. నిజంగా అవన్నీ వదంతులే. సినిమాలో నా ఎదుగుదల గిట్టని వారెవరో ఇలాంటి పుకార్లు పట్టిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment