తమిళసినిమా: సినీరంగంలో వారసుల రంగప్రవేశం సర్వసాధారణం. అయితే హీరోలు, దర్శక నిర్మాతల వారసులు అధికంగా వస్తున్నా, హీరోయిన్ల చెల్లెళ్లు హీరోయిన్ అవడం అరుదే. వచ్చినా నిలదొక్కుకున్న వారు తక్కువే. తాజాగా నటి ఇనియ చెల్లెలు తార కథానాయకిగా రంగంలోకి దిగింది. కిబిట్టాంగయ్యా కిళంబిట్టాంగయ్యా చిత్రంలో కథానాయకిగా నటించింది. ఈ అమ్మడి లక్ ఏమిటంటే ప్రముఖ దర్శకుడు, నటుడు కే.భాగ్యరాజ్, ఆర్.సుందర్‌రాజన్, ఆర్‌వీ.ఉదయకుమార్, మన్సూర్‌అలీఖాన్, రాజ్‌కపూర్‌అనుమోహన్ వంటి వారితో తొలి చిత్రంలోనే కలిసి నటించే అవకాశం తారను వరించడం.అంతే కాదు గాయకుడు మనో వారసుడు రతీశ్ హీరోగా నటించిన ఈ చిత్రంలో ఆయనకు జంటగా తార నటించింది.
ఈ చిత్రంలో నటించిన అనుభవాన్ని ఈ నవ కథానాయకి తెలుపుతూ కిళంబిట్టాంగయ్యా కిళంబిట్టాంగయ్యా చిత్రం పూర్తిగా వినోదభరితంగా సాగే యాక్షన్, థ్రిలర్ కథా చిత్రంగా ఉంటుందన్నారు. దర్శకుడు రజాక్ చిత్రాన్ని జనరంజకంగా తెరకెక్కించారని చెప్పింది.ప్రేక్షకులు రెండు గంటల పాటు కడుపుబ్బ నవ్వుకుంటారని చెప్పింది. ఈ చిత్రంలో తాను నటుడు మన్సూర్‌అలీఖాన్‌కు కూతురిగా నటించానని తెలిపింది. మొదట్లో ఆయన్ని చూస్తేనే భయం కలిగేదని, ఆ తరువాత మంచి ఫ్రెండ్స్ అయిపోయామని అంది. మన్సూర్ అలీఖాన్ ధైర్యం చెప్పి బాగా నటించడానికి సహకరించారని చెప్పింది. చిత్రం చివరి ఘట్టంలో తాను హీరోతో కలిసి పారిపోయే సన్నివేశం చోటు చేసుకుంటుందని తెలిపింది. ఆ సన్నివేశాలను కెమెరాలను చెట్ల చాటున పెట్టి చిత్రీకరించారని చెప్పింది.
రాళ్లు, రప్పలు కలిగిన ఆ రోడ్డుపై సహజంగా ఉండాలని హీరోతో కలిసి వేగంగా పరిగెత్తానని అంది. కుక్కలు వెంట పడినప్పుడు కూడా తాను పరిగెత్తలేదని, అంతగా ఈ చిత్రం కోసం పరుగులు పెట్టానని చెప్పింది. మీకు నటనలో అక్క ఇనియ ఏమైనా సలహాలిచ్చారా? అన్న ప్రశ్నకు తమిళ భాషను చక్కగా నేర్చుకో. అప్పుడే నటిగా నిలబడగలవు అని అక్క సలహా ఇచ్చిందని అంది. మరి ఈ కిళంబిట్టాంగయ్యా కిళంబిట్టాంగయ్యా చిత్రం నవ నటి తారకు ఏ మేరకు బ్రేక్ ఇస్తుందన్నది వేచి చూడాలి. పవర్‌స్టార్ శ్రీనివాసన్, అస్మిత, విశ్వా,కన్నన్, రాజ్, దివ్య ముఖ్య పాత్రలను పోషించిన ఈ చిత్రానికి శ్రీకాంత్ దేవా సంగీతాన్ని, శ్రీధర్ ఛాయాగ్రహణం అందించారు. హెవెన్ ఎంటర్‌టెయిన్‌మెంట్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment