మురళీమోహన్, జమున, టి.సుబ్బరామిరెడ్డి, జయసుధ
‘‘నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావుగార్లు ధ్రువతారలు. ఏ వేడుకలకు పిలిచినా వచ్చేవారు. అవార్డులు ఇస్తే తీసుకునేవారు. కానీ నేటి తరంలో కొందరు కళాకారులు పబ్లిక్‌లోకి వచ్చి అవార్డులు అందుకోవడం వల్ల తమ గౌరవం తగ్గిపోతుందన్నట్లుగా భావిస్తున్నారు. అది సరైనది కాదు. వారు ఎన్టీఆర్, ఏయన్నార్‌ల క్రమశిక్షణను ఫాలో కావాలని కోరుకుంటున్నాను’’ అని కళాబంధు, టీఎస్సార్ లలిత కళాపరిషత్ వ్యవస్థాపకులు టి. సుబ్బరామిరెడ్డి అన్నారు. ఆయన జన్మదిన వేడుకలు ఈ నెల 16, 17 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్నాయి.
ఈ సందర్భంగా ‘అభినయ మయూరి’ అనే బిరుదుతో ప్రముఖ నటి జయసుధను సత్కరించనున్నారు. ఈ కార్యక్రమాల గురించి హైదారాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టి. సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ– ‘‘చాలామంది సినిమాను, కళాకారులను అపార్థం చేసుకుంటుంటారు. నిజం చెప్పాలంటే సినిమాల్లో ఉన్న దైవశక్తి ఇంకెందులోనూ లేదు. నటీనటులు, దర్శకులు, రచయితలు, గాయకులు.. ఇలా అందరూ కలిస్తేనే మనం సినిమాను ఎంజాయ్ చేయగలుగుతున్నాం. నేను సంతోషంగా ఉండటానికి కారణం కళాకారులను ప్రోత్సహించుకోవడమే. కళని ఒక ఈశ్వరశక్తిగా భావించే వ్యక్తిని నేను. గత ఏడాది జమునగారిని సన్మానించాం.
ఈ ఏడాది ఈ నెల17న ‘అభినయ మయూరి’ బిరుదుతో జయసుధగారిని సత్కరిస్తున్నాం. దాదాపు 46ఏళ్ల సినిమా ప్రస్థానం ఉన్న ఆమె తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేకస్థానం ఏర్పరచుకున్నారు. మనమందరం గర్వించదగ్గ నటీమణి ఆమె. 16న ఆధ్యాత్మిక కార్యక్రమం జరుగుతుంది’’ అన్నారు. ‘‘తిరుపతి’ సినిమాలో నేను, జయసుధగారు కలిసి నటించాం. ‘జ్యోతి’ సినిమాతో ఆమెకు పెద్ద పేరు వచ్చింది. సుబ్బరామిరెడ్డిగారు జయసుధగారికి ఈ అవార్డు ఇవ్వబోతుండటం సంతోషంగా ఉంది. ఈ మధ్యకాలంలో అవార్డు ఫంక్షన్స్‌ను కొద్ది మంది మాత్రమే చేస్తున్నారు. ప్రభుత్వం తరఫు అవార్డులు ఇవ్వడం లేదు. నంది అవార్డుల గురించి పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఇచ్చే అవార్డు అంటే చాలా గొప్పగా చెప్పుకుంటాం. దయచేసి ఇప్పటి ప్రభుత్వమైనా గుర్తించి అవార్డులను ఇవ్వాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.
‘‘సుబ్బరామిరెడ్డిగారికి కళలన్నా, కళాకారులన్నా మంచి అభిమానం. మహానటి అంటే మనమందరం ఒకరే అనుకుంటాం. కానీ అందరూ మహానటులే. లేకపోతే ఒక ఆర్టిస్టుగా ఎక్కువ కాలం నిలబడలేం. జమునగారి నుంచి క్రమశిక్షణను నేర్చుకున్నాను. గొప్పనటి జమునగారు నన్ను మహానటి అని పిలవడం చాలా సంతోషంగా ఉంది. ఎంతోకాలంగా కష్టపడుతున్నందుకు కళాకారులకు అవార్డులనేవి గుర్తింపు. కొన్ని అవార్డ్స్ వచ్చినందుకు సంతోషంగా ఉంటుంది. తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు నంది అవార్డులను పక్కన పెట్టేశాయి. అవార్డ్స్ ఇవ్వండి.. మీరే మమ్మల్ని గుర్తించకపోతే ఎలా? వేడుకలకు, ప్రారం భోత్సవాలకు, స్వచ్ఛంద సేవ, సామాజిక సేవ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటాం. స్వచ్ఛభారత్ అంటూ ఊడ్చుతాం. ఇలా అన్నీ చేస్తాం. మమ్మల్ని గుర్తించి అవార్డ్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. నాకు ఇండస్ట్రీలో ఇద్దరు సోదరులు.. ఒకరు మురళీమోహన్‌గారు, మరొకరు మోహన్‌బాబుగారు. వీరితో ఎన్నో సినిమాలు చేశాను’’ అన్నారు.
‘‘ఇంతమంది కళాకారులను ప్రోత్సహిస్తూ తనకు సినిమాల పట్ల, సినిమా పరిశ్రమల పట్ల ఉన్న అభిమానాన్ని చాటుకుంటున్నారు సుబ్బరామిరెడ్డిగారు. కళాకారులను మర్చిపోకుండా గౌరవిస్తున్నారు. మురళీమోహన్‌గారు అందాల హీరో. ఆయన ఇప్పుడు తెల్ల జుత్తుతో ఉంటే మాకు నచ్చడం లేదు (నవ్వుతూ). ‘పండంటి కాపురం’ సినిమాలో నా కూతురిగా నటించారు జయసుధ. మా అమ్మాయి నటిగా ఈ స్థాయికి రావడం సంతోషంగా ఉంది’’ అన్నారు నటి జమున.
Comments
Please login to add a commentAdd a comment