కాల్ సెంటర్‌లో నిఖిలా
కరోనా వల్ల ఏర్పడిన కష్ట కాలంలో వీలైనంత సహాయం అందించడానికి సినిమా స్టార్స్ ముందుకు వస్తున్నారు. కరోనాపై పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. మలయాళ నటి నిఖిలా విమల్ కూడా తనకు తోచిన విధంగా సహాయం చేస్తున్నారు. కేరళలోని కన్నూర్ ప్రాంతంలో కోవిడ్ 19–కాల్ సెంటర్లో పని చేస్తున్నారామె. లాక్ డౌన్ కారణంగా అందరికీ నిత్యావసర వస్తువులు అందుతున్నాయా? లేదా? అని తెలుసుకోవడంతో పాటు ఏదైనా సమస్యలు వస్తే వాటిని పరిష్కరించడానికి ఈ కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఏదైనా ఇబ్బంది, సందేహాలు ఉన్నవాళ్లు ఫోన్ చేసి సమాచారం తెలుసుకోవచ్చు, సహాయం పొందవచ్చు.
ఈ కాల్ సెంటర్‌లో సిబ్బంది అవసరం ఉందని తెలిసి వాలంటీర్‌గా పని చేయాలనుకున్నారట నిఖిల. ప్రతి రోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కాల్ సెంటర్లో పని చేస్తున్నారామె. తన వివరాలేవీ కాలర్‌కి తెలియకుండా పని చేసుకుంటూ వెళ్తున్నారట. ఈ కాల్ సెంటర్ చేరుకోవడానికి 20 కిలో మీటర్లు ప్రయాణిస్తున్నారట కూడా. ‘‘ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో నా వంతు సహాయం చేయడం, అది ఉపయోగకరంగా ఉండడం సంతోషంగా ఉంది. ఇదో సరికొత్త అనుభూతి. అందరం కూడా ఏదో విధంగా సహాయపడటానికి ట్రై చేద్దాం’’ అన్నారు నిఖిలా విమల్. మోహన్ బాబు నటించిన ‘గాయత్రి’ సినిమాలో ఆయన కుమార్తె పాత్రలో నిఖిల నటించిన విషయం గుర్తుండే ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment