సాక్షి, సిటీబ్యూరో: లాక్‌డౌన్ కారణంగా ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు, అవసరమైన సహాయాన్ని వెంటనే అందించేందుకు జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ‘కోవిడ్–19 కాల్ సెంటర్’ నిరంతరాయంగా పనిచేస్తోంది. ఆపదలో ఉన్నవారికి ఇది ఎంతో ఉపయోగపడుతోంది. ఈ సెంటర్‌ను మార్చి 22వ తేదీన ఏర్పాటు చేశారు. జీహెచ్‌ఎంసీ కాల్‌సెంటర్ నెంబర్(040–21 11 11 11)నే దీనికీ వినియోగిస్తున్నారు. కట్టడి సమయంలో అత్యవసరంగా ఆస్పత్రులకు వెళ్లాల్సిన వారితోపాటు ఆకలితో అలమటిస్తున్నవారు ఫోన్ చేసినా స్పందించి వెంటనే తగిన సహాయం అందిస్తున్నారు.ఇందుకుగాను దిగువ స్థాయి నుంచి ఉన్నతాధికారుల వరకుసమన్వయంతో పనిచేసే టీమ్‌లను ఏర్పాటు చేశారు. కంటైన్మెంట్ జోన్ల వారీగా, సర్కిళ్ల వారీగా కూడా తక్షణ చర్యలకు అవసరమైన ఏర్పాట్లు చేసేందుకు అడిషనల్ కమిషనర్లు, తదితర ఉన్నతాధికారులకు సర్కిళ్ల వారీగా బాధ్యతలప్పగించారు.
ఆహారం, అంబులెన్సుల సదుపాయం నుంచి మొదలుకొని వలస కార్మికులకు ఆహారం, వసతి, రేషన్ బియ్యం అందకపోవడం తదితర ఫిర్యాదుల్ని సైతం స్వీకరిస్తున్నారు. ఫోన్ కాల్స్‌తో పాటు ట్విట్టర్ వంటి సామాజిక వేదికల ద్వారా అందే విజ్ఞప్తులను, ఈమెయిల్స్ ద్వారా జీహెచ్‌ఎంసీకి అందిన ఫిర్యాదులను పరిష్కరిస్తున్నారు. ఆపత్కాలంలో, తప్పనిసరిగా ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన వారు సైతం కాల్‌సెంటర్‌కు ఫోన్ చేస్తున్నారు. అందే సమస్యలన్నింటినీ వెంటనే పరిష్కరించేందుకుగాను వివిధ విభాగాల అధికారులను కూడా కంట్రోల్‌రూమ్ ఫిర్యాదుల పరిష్కారంలో భాగస్వాముల్ని చేశారు. కంటైన్‌మెంట్ జోన్లో ఉన్న తమకు నిత్యావసరాలు అందడం లేదని, హోమ్‌క్వారంటైన్ పాటించడం లేరంటూ ఫిర్యాదులొచ్చినా స్థానికంగా ఉండే యంత్రాంగాన్ని వెంటనే అప్రమత్తం చేసి అందజేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకుగాను సంసిద్ధంగా ఉండే ఉద్యోగులు, వాలంటీర్లతోపాటు తగినన్ని వాహనాలను, అంబులెన్సులను వివిధ ప్రాంతాల్లో అందుబాటులో ఉంచారు. ఫిర్యాదులను పరిష్కరించడంతోపాటు, పరిష్కారమయ్యాక వారి స్పందనను కూడా తెలుసుకుంటున్నారు.
కాల్‌సెంటర్‌లో..
జీహెచ్‌ఎంసీలోని వివిధ విభాగాలతోపాటు రెవెన్యూ, పౌరసరఫరాలు, వైద్య, ఆరోగ్యశాఖ, కార్మికశాఖ తదితర విభాగాలకు చెందిన అధికారులు కాల్‌సెంటర్‌లో అందుబాటులో ఉంటారు. వీరితోపాటు 104, 108 అంబులెన్స్ సర్వీసులకు సంబంధించిన అధికారులు కూడా ఉంటారు. కాల్స్ ఆధారంగా క్షేత్రస్థాయిలోని వారికి సూచనలిస్తారు. కాల్‌సెంటర్‌లో షిఫ్టుకు 20 మంది చొప్పున రోజుకు మూడు షిఫ్టులుగా 60 మంది 24 గంటల పాటు విధులు నిర్వహిస్తున్నారు. సత్వర సేవల కోసం క్షేత్రస్థాయిలో వివిధ ప్రాంతాల్లో 32 అంబులెన్సులు ఉంచారు. కంటైన్మెంట్ ప్రాంతాలకు సరుకుల రవాణా కోసం 30 వాహనాలను కూడా వినియోగిస్తున్నట్లు పేర్కొన్నారు.
సేవలు ఇలా...
ఫోన్ చేసిన వారి అవసరం, సంప్రదించాల్సిన ఫోన్‌నెంబర్, చిరునామా వంటి వివరాలను కంట్రోల్‌రూమ్ సిబ్బంది సేకరిస్తారు. క్షేత్రస్థాయిలో ఆ చిరునామాకు దగ్గరలో ఉన్న సంబంధిత ఉద్యోగి/వాలంటీర్‌కు ఎస్‌ఎంఎస్ ద్వారా సమాచారం వెళ్తుంది. అలాగే ఫోన్ చేసిన వారికి కూడా ఎస్‌ఎంఎస్ ద్వారా ఉద్యోగి/వాలంటీర్ ఫోన్‌నెంబర్ తెలుస్తుంది. ఎంత సమయంలో వారి అవసరం తీరుతుందో సుమారుగా తెలియజేస్తారు. భోజనం కావాలని ఫోన్లు వస్తే వారికి దగ్గర్లో ఉన్న అన్నపూర్ణ కేంద్రం చిరునామా తెలుపుతారు. కదలలేని వారికైతే మొబైల్ వాహనం ద్వారా చిరునామాకు ఫుడ్ ప్యాకెట్స్ అందజేస్తారు. పంపిణీ సందర్భంగా ఫొటోలు కూడా తీసుకుంటారు. వారి నుంచి ఫీడ్‌బ్యాక్ కూడా కోరతారు.
ఇతర ప్రాంతాల నుంచి కూడా..
జీహెచ్‌ఎంసీ పరిధిలోని వారి కోసం ఈ కాల్‌సెంటర్‌ను అందుబాటులోకి తెచ్చిన ప్పటికీ వివిధ జిల్లాలు, రాష్ట్రాల నుంచి కూడా విజ్ఞప్తులు అందుతున్నాయి. ఫోన్‌లతోపాటు సామాజిక మాధ్యమాలు, మెయిల్స్ ద్వారా అందే విజ్ఞప్తుల్ని సైతం పరిశీలించి, పరిష్కరిస్తున్నట్లు సంబంధిత అధికారి పేర్కొన్నారు. వైద్యావసరాలు, ఇతరత్రా అవసరాల కోసం ఇతర జిల్లాలకు వెళ్లాల్సిన వారు, ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన వారు సైతం ఫోన్లు చేస్తున్నారు. తగిన పాస్‌లు ఇప్పించాల్సిందిగా కోరుతుండటంతో సంబంధిత అధికారుల ద్వారా వాటిని అందించే ఏర్పాట్లు చేస్తున్నారు.
వినతులెన్నో..
వివిధ అవసరాల కోసం వచ్చే కాల్స్ క్రమేపీ పెరుగుతున్నాయి. రోజురోజుకూ దీని గురించి ఎక్కువమందికి తెలుసుండటంతో ఆహారం అవసరమైన వారు ఎక్కువగా కాల్ చేస్తున్నారు. సంబంధిత అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. తాజాగా సోమవారం సాయంత్రానికి వివిధ అంశాలకు సంబంధించి దాదాపు 570 కాల్స్ అందాయి.
కాల్‌సెంటర్ ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటి వరకు అందిన కాల్స్ .. అంశాల వారీగా..
మొత్తం కాల్స్: 9269
కరోనాకు సంబంధించినవి: 576
అంబులెన్సు సదుపాయం కోసం: 274
రేషన్ కోసం : 805
అన్నపూర్ణ మొబైల్ క్యాంటీన్ కోసం(ఈనెల 9 నుంచి): 7483
ఫుడ్ ప్యాకెట్ల పంపిణీ: 3,42,000
మెయిల్స్ ద్వారా..రాష్ట్రంలో ఇతర జిల్లాలకు వెళ్లేందుకు : 32
ఇతర రాష్ట్రాలకు వెళ్లేందుకు : 57
రాష్ట్రంలో వైద్యావసరాల కోసం: 27
ఇతర రాష్ట్రాల్లో వైద్యావసరాల కోసం: 18
హోమ్ క్వారంటైన్ ఉల్లంఘనలు : 2
లాక్‌డౌన్ ఉల్లంఘనలు: 3
పారిశుధ్యానికి సంబంధించి: 20
అధిక ధరలకు సంబంధించి: 5
ట్టిట్టర్ ద్వారా అందిన విజ్ఞప్తులు: 110
విదేశీప్రయాణికుల నుంచి తీసుకున్న ఫీడ్‌బ్యాక్: 3885
కంటైన్మెంట్ జోన్ల నుంచి..
కంటైన్మెంట్ ప్రాంతాలనుంచి ఆహారం కావాలంటూ సోమవారం దిగువ ప్రాంతాలనుంచి ఫోన్స్ వచ్చాయి: మలక్‌పేట, సంతోష్‌నగర్, చార్మినార్, చాంద్రాయణగుట్ట, ఫలక్‌నుమా, రాజేంద్రనగర్, మెహదీపట్నం, ఖైరతాబాద్, కార్వాన్, జూబ్లీహిల్స్, గోషామహల్, ముషీరాబాద్, బేగంపేట, అంబర్‌పేట, యూసుఫ్‌గూడ, శేరిలింగంపల్లి, చందానగర్, ఆర్‌సీపురం, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, గాజుల రామారం, అల్వాల్, మల్కాజిగిరి, ఉప్పల్, సరూర్‌నగర్.
Comments
Please login to add a commentAdd a comment