
తమిళసినిమా: నటనలో తాను చాలా వీక్ అని అంటోంది నటి తాప్సీ. దక్షిణాదిని వదిలి ఉత్తరాదిలో మకాం పెట్టిన తరువాత ఆ జాణ పొంతన లేని వ్యాఖ్యలతో ప్రచారంలో ఉండడానికి ప్రయత్నిస్తోందనిపిస్తుంది. ఆ మధ్య ఒక ప్రముఖ దర్శకుడిపై సెటైర్ వేసి కలకలం సృష్టించింది. ఆ తరువాత క్షమాపణలు చెప్పుకోక తప్పలేదనుకోండి. తమిళం, తెలుగు, హిందీ అంటూ బహుభాషా నటిగా గుర్తింపు పొందిన తాప్సీ తాజాగా తాను నటనలో చాలా వీక్ అంటూ మరోసారి వార్తల్లోకెక్కింది. ఆ సంగతేంటో చూద్దామా.. కొత్తగా అవకాశాలు కోసం వచ్చే తారలకు దర్శకులు ఆడిషన్ నిర్వహిస్తారు.
ఆ టెస్ట్‌లో సంతృప్తి కలిగిస్తేనే అవకాశాలు ఇస్తారు. అదేంటో గానీ, నా జీవితంలో అలాంటి ఏ టెస్ట్‌లోనూ నేను పాస్ అవలేదు. ఇది కొంచెం సీరియస్ అంశమే. నటనలో నేను చాలా వీక్. అసలు నాకు కెమెరా ముందు నటించడం రాదు. దర్శకులు చెప్పినట్లు నటించలేను. అందుకేనేమో అన్ని టెస్ట్‌ల్లోనూ ఫెయిల్ అయ్యాను. అయినా నాపై ప్రేమాభిమానాలున్న వారి ద్వారా లభించిన మంచి రెస్పాన్స్ నన్ను ఉత్సాహపరచడంతోనే నటినయ్యాను. వారి ప్రోత్సాహంతోనే నటనలో 100 శాతం ప్రతిభను చాటకపోయినా కొంచెం కొంచెంగా నటించడం ప్రారంభించాను. ఆ అనుభవమే నటిగా నన్నీ స్థాయిలో నిలబెట్టింది అని తాప్పీ పేర్కొంది. వినేవాళ్లుంటే ఎన్నైనా చెప్పవచ్చన్నది తాప్సీ లాంటి వారిని చూసే అన్నారేమో అనిపిస్తోంది కదూ.