అదితీరావు హైదరీ
‘‘ఒకరోజు ఇంద్రగంటిగారు ఫోన్ చేసి ‘సమ్మోహనం’ సినిమా గురించి చెప్పారు. పెద్దలు కథ చెబుతుంటే చిన్న పిల్లలు ఆసక్తిగా వింటారు కదా. అంత క్రమశిక్షణతో నేను కథ విన్నాను. చాలా నచ్చింది. నా వద్ద డేట్స్ లేకున్నా అడ్జెస్ట్ చేసి, ఈ సినిమా చేశా’’ అని అదితీరావు హైదరీ అన్నారు. సుధీర్‌బాబు, అదితీరావు హైదరీ జంటగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సమ్మోహనం’. శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ఈ సినిమా రేపు విడుదలవుతోంది. ఈ సందర్భంగా అదితీ చెప్పిన విశేషాలు.
► మణిరత్నం ‘కాట్రు వెలియిడై’ (చెలియా) సినిమా ద్వారా దక్షిణాదికి పరిచయమయ్యాను. తెలుగులో ‘సమ్మోహనం’ నా తొలి చిత్రం. కథ నచ్చితేనే క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తున్నా. దక్షిణాదిలో మణిరత్నంగారితో సినిమా చేయాలన్నది నా కల. ‘కాట్రు వెలియిడై’తో అది నెరవేరింది. ఇప్పుడు ఆయనతో రెండో సినిమా కూడా చేస్తున్నాను. తెలుగులో శేఖర్ కమ్ముల, తమిళంలో మిస్కిన్, గౌతమ్‌మీనన్ వంటి దర్శకులతో పనిచేయాలనుకుంటున్నా.
► వాళ్లవి కాని ఎమోషన్స్‌ని మనసులోకి తెచ్చుకుని ప్రేక్షకులను రంజింపజేయడానికి హీరోయిన్లు కృషి చేస్తారు. దాన్ని అభినందించాలి. అంతేగానీ హీరోయిన్లంటే కేవలం రక్తం, మాంసం ముద్దగా చూడకూడదు. మేం స్క్రీన్ మీద మేకప్‌తో కనిపిస్తాం. దాని వెనక ఉన్న మనసును చూడాలి. అందరూ మనలాంటి అమ్మాయిలే అనుకోవాలి. నేనైతే స్త్రీ, పురుషులు సమానమే అనుకుంటా. మావాళ్లు అలాగే పెంచారు.
► ఇప్పుడు హైదరాబాద్‌లో ఉన్నానని చెప్పడం కాదు. నన్ను ఎప్పుడు ఎవరు అడిగినా నేను హైదరాబాదీనే అని చెప్పుకుంటా. అలా చెప్పుకోవడానికి గర్వపడతాను. ఇంట్లో ఉర్దూ, తెలుగు మాట్లాడమని మా తాత చెప్పేవారు. కానీ నేను వినలేదు. ‘సమ్మోహనం’ కోసం తెలుగు నేర్చుకుని డబ్బింగ్ చెబుతుంటే చాలా ఆనందంగా అనిపించింది.
► ‘సమ్మోహనం’ షూటింగ్‌లో అందరూ బాగా చూసుకోవడంతో అలసిపోయినట్టు అనిపించలేదు. ఈ సినిమా చాలా సెన్సిటివ్‌గా ఉంటుంది. ఈ చిత్రంలో లవ్‌స్టోరీ స్పెషాలిటీ తెరమీదే చూడాలి. ‘చెలియా’ సినిమా తెలుగులో సరిగ్గా ఆడలేదేమో కానీ, తమిళంలో బాగా ఆడింది. నేను అంత త్వరగా నెగటివ్ విషయాల గురించి ఆలోచించను.
► సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో వరుణ్‌తేజ్ హీరోగా తెరకెక్కుతోన్న సినిమాలో ఆస్ట్రోనాట్‌గా చేస్తున్నాను. ఉదయాన్నే రోప్ వర్క్స్ నేర్చుకుంటున్నా. రాత్రి మణిరత్నం సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నా. నేను బాగా కష్టపడతాను. ఎదుటివారిని గౌరవిస్తాను. నన్ను గౌరవించాలనుకుంటాను. మనకి ఎవరో వచ్చి గౌరవాలు ఇవ్వరు. ముందు మనల్ని మనం గౌరవించుకుంటే, ఎదుటివాళ్లు కూడా గౌరవిస్తారని నమ్ముతా.
Comments
Please login to add a commentAdd a comment