
బాలాజీ భక్తుడిగా...బంగార్రాజుగా...
మనం’ లాంటి క్లాసికల్ మూవీనీ, ‘సోగ్గాడే..’ వంటి కుటుంబ కథా చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు.
‘‘ ‘మనం’ లాంటి క్లాసికల్ మూవీనీ, ‘సోగ్గాడే..’ వంటి కుటుంబ కథా చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. ‘సోగ్గాడే’ 50 కోట్లకు పైగా వసూలు చేయడం ఆనందంగా ఉంది. ‘మాయాబజార్’, ‘ప్రేమాభిషేకం’ వంటి చిత్రాలు ఇప్పుడు విడుదలైతే భారీ వసూళ్లు సాధిస్తాయి. నా ‘శివ’ కూడా ఇప్పుడు విడుదలైతే మంచి వసూళ్లు రాబడుతుంది. అందుకే నేను కలక్షన్స్‌ని పెద్దగా పట్టించుకోను’’ అని నాగార్జున అన్నారు. కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నాగార్జున, రమ్యకృష్ణ, లావణ్యా త్రిపాఠీ కాంబినేషన్లో రూపొందిన చిత్రం ‘సోగ్గాడే చిన్ని నాయనా’. ఈ చిత్రం థ్యాంక్స్ మీట్‌లో నాగార్జున మాట్లాడుతూ- ‘‘ఈ చిత్రవిజయం తాలూకు ఘనత కల్యాణ్‌కృష్ణకే దక్కుతుంది’’ అన్నారు.
తదుపరి చిత్రాల గురించి మాట్లాడుతూ - ‘‘కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగచైతన్య ఓ సినిమా చేస్తాడు. అలాగే, ‘సోగ్గాడే...’లో బాగా హిట్టయిన ‘బంగార్రాజు’ క్యారెక్టర్ పేరుతో ఆ చిత్రానికి సీక్వెల్‌గా కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నేనో సినిమా చేయనున్నా. వెంకటేశ్వర స్వామి భక్తుడు హథీరాం బాబాగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఓ సినిమా ఉంటుంది. 18వ శతాబ్దానికి సంబంధించిన కథ ఇది. అలాగే, ‘దిల్’ రాజు ఒక కథ వినమని అడిగారు... వినాలి’’ అన్నారు. అఖిల్ తదుపరి సినిమా విషయంలో తొందరపడదల్చుకోలేదనీ, ఎంపిక విషయంలో ఎక్కువ కేర్ తీసుకుంటాననీ ఆయన చెప్పారు.