వెండితెరపైనా భార్యాభర్తలే!
వెండితెరపైనా భార్యాభర్తలే!
Published Fri, Sep 27 2013 2:03 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM
ఓ బిడ్డకు తల్లయిన ఐశ్వర్యారాయ్ మళ్లీ ఎప్పుడు తెరపై కనిపిస్తారు? ఏ సినిమా ద్వారా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తారు? లాంటి చర్చలు గత రెండేళ్లుగా జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడా చర్చలకు దాదాపు ఫుల్‌స్టాప్ పడేట్లు ఓ వార్త బయటికొచ్చింది. ఐశ్వర్యరాయ్ ఓ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని బాలీవుడ్ టాక్. అది కూడా తన భర్త అభిషేక్‌బచ్చన్ సరసన నటించబోతున్నారు. ఈ విషయాన్ని చిత్రనిర్మాత గౌరంగ్ దోషి ఓ ప్రకటనలో తెలిపారు.
సినిమా పేరు ‘హ్యాపీ యానివర్శరీ’ ఇప్పటివరకు పలు వాణిజ్య ప్రకటనలకు దర్శకత్వం వహించిన ప్రహ్లాద్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. ప్రహ్లాద్ చిత్రీకరించినవాటిల్లో ఐష్ నటించిన యాడ్ కూడా ఒకటుంది. 20 ఏళ్ల క్రితం ఈ చిత్రీకరణ జరిగింది. ఇన్నేళ్ల గ్యాప్ తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్ వెండితెరకు సెట్ అవ్వడం ఓ విశేషం. ఇక, ఇప్పటివరకు థాయ్ అక్షర్ ప్రేమ్ కీ, కుచ్ నా కహో, సర్కార్ రాజ్, గురు, ధూమ్ 2.. సినిమాల్లో కలిసి నటించారు అభి, ఐష్. ఈ ఇద్దరూ నటించబోతున్న ఈ ఆరవ చిత్రం బడ్జెట్ అరవై కోట్లు అని వినికిడి.
వైవాహిక జీవితం నేపథ్యంలో సాగే ఈ చిత్రం షూటింగ్‌ని ఎక్కువ శాతం సౌత్ ఆఫ్రికాలో జరపడానికి ప్లాన్ చేసుకున్నారు. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ చిత్రం సెట్స్‌కు వెళుతుంది. ఈలోపు ఐష్ మరింత స్లిమ్ అవ్వాలనుకుంటున్నారు. ఈ చిత్రానికి కథ సమకూర్చడంతో పాటు, ఓ నిర్మాతగా వ్యవహరించనున్న గౌరంగ్ దోషి మాట్లాడుతూ -‘‘బచ్చన్ కుటుంబంతో నాకు మంచి అనుబంధం ఉంది. యాడ్ వరల్డ్‌లో తిరుగులేని దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న ప్రహ్లాద్ కక్కర్ ఇప్పటివరకు 60 చిత్రాలను తిరస్కరించారు.
కానీ ఈ చిత్రకథ వినగానే, డెరైక్ట్ చేయడానికి అంగీకరించారు. అన్ని సినిమాలను వదులుకున్న ప్రహ్లాద్ ఈ సినిమాని ఒప్పుకున్నారంటే, ఈ కథ ఎంత అద్భుతంగా ఉంటుందో ఊహించవచ్చు. అలాగే కొంత విరామం తర్వాత ఐశ్వర్య ఒప్పుకున్న మొదటి చిత్రం ఇదే. దీన్నిబట్టి ఆమెకు ఈ కథ ఎంత నచ్చి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇందులో అభిషేక్, ఐశ్వర్య భార్యాభర్తలుగా నిజజీవిత పాత్రలు చేయబోతున్నారు’’ అని చెప్పారు.
Advertisement
Advertisement