అఖిల్ నాకు పోటీ అవుతాడు..అవ్వాలి కూడా : నాగ చైతన్య
‘‘నిజంగా ‘మనం’ సినిమా తాతయ్యకు ఘనమైన నివాళి. అవార్డుల కోసమో, రివార్డుల కోసమో మేమీ సినిమా చేయలేదు. తాతయ్య చివరి సినిమా అక్కినేని వంశాభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలనే తలంపుతో ఈ సినిమా చేశాం. అమెరికాలో అయితే.. ఇప్పటికే మిలియన్ (పది లక్షల) డాలర్ల వసూళ్లు వచ్చాయి. మా కుటుంబ హీరోల చిత్రాల్లో ఇంతటి వసూళ్లను రాబట్టిన సినిమా ఇదే’’ అని నాగ చైతన్య సంతోషం వెలిబుచ్చారు. మంగళవారం విలేకర్లతో ముచ్చటించారు.
మీ తాతయ్యతో, మీ నాన్నతో తొలిసారి కలిసి నటించారు కదా. ఆ అనుభూతి ఎలా ఉంది?
నాకు వంద ఫ్లాపులొచ్చినా, వంద విజయాలొచ్చినా.. ‘మనం’ మాత్రం నా కెరీర్‌లో ప్రత్యేకమైన సినిమా. తాతయ్యతో నటించే భాగ్యం ఈ సినిమాతో నాకు దక్కింది. ఆ మధుర క్షణాలు నా గుండెలో నిలిచిపోతాయి. భవిష్యత్తులో నా ఉన్నతికి అవి మరింత దోహదం చేస్తాయి. ఫస్ట్ షెడ్యూల్ పూర్తయ్యేంత వరకూ నాన్నతో, తాతయ్యతో కలిసి నటించడానికి తడబడుతూనే ఉన్నాను. తలబిరుసుగా నటించాలి, తాగుబోతుగా నటించాలి. పైగా కొన్ని సన్నివేశాల్లో తాతయ్యను ‘ముసలోడా’ అని సంబోధించడానికి ఇబ్బంది పడ్డా. తాతయ్య, నాన్న నా రోల్ మోడల్స్. వారి ముందు అలా నటించడం చాలా కష్టంగా అనిపించింది. కానీ వారిద్దరి సహకారం అద్భుతం.
పవన్‌కల్యాణ్‌కి ‘ఖుషి’, మహేశ్‌కి ‘ఒక్కడు’, ఎన్టీఆర్‌కి ‘సింహాద్రి’, బన్నీకి ‘దేశముదురు’... మీకేమో ‘మనం’... ఇలా స్టార్ హీరోలందరికీ ఏడో సినిమా బ్రేక్ ఇచ్చింది. మీరేమంటారు?
అది యాదృచ్ఛికమే. నాక్కూడా అదే రిపీట్ అవ్వడం ఆనందంగా ఉంది.
తాత ‘మూగ మనసులు’, నాన్న ‘జానకిరాముడు’, మీరేమో ‘మనం’... ముగ్గురూ పునర్జన్మల నేపథ్యంతో కూడిన సినిమాలు చేయడం కూడా యాదృచ్ఛికమే కదా!
అవును... అది కూడా కావాలని చేసిందేం కాదు. అయితే.. ‘మనం’ చేశాక పునర్జన్మ విషయంలో కొంత నిజం ఉందనిపిస్తోంది. గత జన్మలో తీరని కోర్కెలు ఏమైనా ఉంటే...మళ్లీ పుట్టి ఆ కోర్కెలను తీర్చుకుంటారని కొన్ని కథలు కూడా వెలువడ్డాయి.
ప్రయోగాల్నిమన హీరోలు దరిచేరనీయరు. ఓ హీరోగా ఈ విషయంపై మీ దృక్కోణం ఏంటి?
నా మైండ్‌సెట్‌లో కొంత మార్పు వచ్చిందండీ. ప్రయోగాల్ని ప్రేక్షకులు తప్పక ఆదరిస్తారు. సరైన కథ, కథనాలు, ఆసక్తిని గొలిపే అంశాలు, పుష్కలంగా వినోదం ఉంటే.. ప్రయోగాలు కూడా సఫలం అవుతాయని ‘మనం’ రుజువు చేసింది. ఇక నుంచి కూడా ప్రయోగాత్మక చిత్రాలు చేయాలని ఉంది. కెరీర్ మొదట్లో తాతయ్య, నాన్న కూడా ప్రయోగాత్మక చిత్రాల్లో నటించారు. పాత్రల పరంగా కూడా భిన్నంగా వెళ్ళారు. వారితో పోల్చి చూస్తే... నేను జీరో. కెరీర్ మొదట్లో నేను కమర్షియల్ సినిమాలే ఎక్కువగా చేశా. ఇక నుంచి వారి దారిలోనే పయనించాలని నిర్ణయించుకున్నాను.
‘ఆటోనగర్ సూర్య’ సంగతేంటి?
ఆ సినిమా జాప్యం విషయంలో నా ప్రమేయం లేదు. కొన్ని కారణాల వల్ల అది ఆలస్యమవుతోంది. అయితే... ఒకటి మాత్రం నిజం. ఆ సినిమా ఎప్పుడు విడుదలైనా హిట్టే.
మీరు చేస్తున్న ‘ఒక లైలా కోసం’ సినిమా ప్రొడక్షన్ పనులు కూడా మీరే చూసుకుంటున్నారట?
సినీ నిర్మాణంలో కూడా అనుభవం అవసరమని నాన్న చెప్పారు. అందుకే.. ఆ సినిమా ప్రొడక్షన్ పనులు దగ్గరుండి చూసుకుంటున్నా. టాకీ పూర్తయ్యింది. పాటల చిత్రీకరణకు విదేశాలకు వెళ్తున్నాం. జూలై లేదా ఆగస్ట్‌లో విడుదల చేస్తాం. భవిష్యత్తులో సినిమాలు నిర్మించాలని కూడా ఉంది.
‘మనం’లో అఖిల్ ఇంట్రడక్షన్ అదిరిపోయింది అంటున్నారు అందరూ. మరి, మీ అభిప్రాయం ఏమిటి?
నిజమే.. అఖిల్ ఎంట్రీ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది. నిజానికి స్క్రిప్ట్ టైమ్‌లో ఆ సీన్ లేదు. అఖిల్ కూడా ఉంటే బావుంటుందని విక్రమ్‌కుమార్ అనడంతో అందరం ‘ఓకే’ చేశాం. కథలో ఆ సీన్‌కి మంచి ప్రాముఖ్యత ఉంది. మా అందర్నీ అఖిలే రక్షిస్తాడు. నిజంగా తనకు అది గ్రేట్ ఇంట్రడక్షన్. అలాంటి పరిచయం లభించడం చాలా లక్కీ అని నేనే అఖిల్‌తో చెప్పా.
అంటే భవిష్యత్తులో అఖిల్ మీకు పోటీ అవ్వబోతున్నాడన్నమాట?
అవుతాడండీ... ఎందుకవడు? అవ్వాలి కూడా. అసలు సినిమా అంటేనే పోటీ. అయితే ఆ పోటీ ఆరోగ్యకరంగా ఉండాలి. మీరన్నట్టు మా కుటుంబంలోనే నాకు కావాల్సినంత పోటీ ఉంది.
కెరీర్ విషయంలో అఖిల్‌కు ఏమైనా సలహాలిస్తుంటారా?
నేను సలహాలివ్వడం కాదు, తనే నాకు సలహాలిస్తుంటాడు (నవ్వుతూ).
సుధీర్‌వర్మ దర్శకత్వంలో సినిమా ఎప్పుడు?
జూలైలో మొదలవుతుంది. కొత్త పంథాలో సాగే యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ అది. సుధీర్ ‘స్వామి రారా’ సినిమా నాకు నచ్చింది. అదే పంథాలో సినిమా చేయడం ఆనందంగా ఉంది.