'ప్రభాస్‌తో చేయాలంటే అదృష్టం ఉండాలి'
ముంబై: బాహుబలి-2 సినిమాను పొగడ్తలతో ముంచెత్తింది బాలీవుడ్ నటి ఆలియా భట్. ఈ విషయాన్ని ట్వీటర్ ద్వారా వెల్లడించింది. బాహుబలిలో ప్రతి సీన్‌ను దర్శకుడు రాజమౌళి అద్భుతంగా తెరకెక్కించారని కితాబిచ్చింది. ఆదివారం ట్వీటర్‌లో ఫ్యాన్స్‌తో కాసేపు చిట్‌చాట్ చేసిన ఆలియా వారు అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పింది.
ప్రభాస్‌తో సినిమా చేస్తారా? అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానంగా అలాంటి చాన్స్ వస్తే అసలు వదులుకొనని పేర్కొంది. ప్రభాస్ అంతర్జాతీయ స్ధాయి నటుడని ఆయనతో నటించడం అంటే అదృష్టం కలిసి రావాలని అంది. బాహుబలి 2 సినిమా గురించి ఒక్కమాటలో చెప్పాలంటే ఎలా చెప్తారు అని మరో అభిమాని అడిగిన ప్రశ్నకు.. ఈ భారీ విజయానికి మరో పేరు కావాలా?. ఇదో రాక్ బస్టర్ చిత్రం. తనకు చాలా నచ్చిందని సమాధానమిచ్చింది ఆలియా. ఆలియా ప్రస్తుతం డ్రాగన్, గల్లీ బాయ్ సినిమాల్లో నటిస్తున్నారు.