పరశురామ్, ‘బన్నీ’ వాసు, విజయ్ దేవరకొండ, అల్లు అరవింద్, పి.కిరణ్, దామోదర ప్రసాద్
‘‘ఓ మంచి సినిమా తీసినప్పుడు ఉండే ఆనందం అనుకోని సంఘటనలు జరిగితే బాధగా మారుతుంది. గుంటూరులో ఉన్న తన మరదలి మెప్పు కోసం ఒక కుర్రాడు సినిమాని బయటపెట్టేశాడు. ఇది కావాలని చేసిన నేరమని అనడంలేదు. తెలిసి చేíసినా తెలియక చేసినా పెద్ద నేరమే’’ అన్నారు నిర్మాత అల్లు అరవింద్. విజయ్ దేవరకొండ, రష్మికా మండన్నా జంటగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గీత గోవిందం’. అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు నిర్మించారు.
రేపు విడుదల కానున్న ఈ చిత్రం కొంత భాగం ఆన్‌లైన్‌లో లీక్ అయిందని చిత్రబృందం ఆవేదన వ్యక్తం చేసింది. పైరసీ గురించి ప్రత్యేకంగా మాట్లాడడానికి సోమవారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో అల్లు అరవింద్ మాట్లాడుతూ – ‘‘ప్రపంచంలో పైరసీ ఎవరు చేసినా 10 నిమిషాల్లో పట్టుకోవచ్చు. రిలీజ్ కాని మా సొత్తును మీరు (పైరసీదారులు) తీసుకోవడం దొంగతనం. సినిమా తీసేవాళ్లందరం సినిమాను దాచుకోవడానికి డీఐటి అనే ఒక సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నాం. అక్కడ పని చేసే ఒక కుర్రాడు చేసిన తప్పు ఇది.
అలా మా సినిమా వైరల్ అయింది. పోలీస్ విచారణ జరుగుతోంది’’ అన్నారు. ‘‘రాత్రి (ఆదివారం జరిగిన ప్రీ–రిలీజ్ వేడుక) నేను అరవింద్‌గారి స్పీచ్ విన్నాను. 40 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న ఆయన సినిమా ఇండస్ట్రీలో ఉండాలా? లేదా అని అనడం బాధగా అనిపించింది. ఎవరో కొంతమంది సరదాగా చేసిన పనికి ఇంత పెద్ద మనిషి బాధపడటం ఏంటి? హెచ్చరిక అనుకోండి.. రిక్వెస్ట్ అనుకోండి. ఇటువంటి తప్పులు జరిగితే క్షమించం. సినిమా అనేది మా ప్రాణం’’ అన్నారు ‘దిల్’ రాజు. పి. కిరణ్ మాట్లాడుతూ– ‘‘ఉద్యోగం కోసం ఇండస్ట్రీకి వస్తుంటారు.
నమ్మి ఉద్యోగం ఇస్తే, ఇలాంటి మోసం చేస్తే ఎవరికి చెప్పుకోవాలి? దయ చేసి స్టూడెంట్స్ ఇలాంటి పనులకు దూరంగా ఉండండి. పైరసీ అనేది ఒక మేజర్ క్రైమ్. చిన్నప్పటి నుంచి పిల్లలకు దొంగతనం చేయకూడదని చెప్పినట్టు పైరసీ కూడా చేయకూడదని ప్రతి ఒక్కరికీ చెప్పాలి’’ అన్నారు. ‘బన్నీ’ వాసు మాట్లాడుతూ – ‘‘నాకు ఆరున్నర సంవత్సరాల కొడుకు, మూడున్నర సంవత్సరాల పాప ఉన్నారు. వాళ్లను చూసి 12 రోజులు అయింది. ఎడిటింగ్ రూమ్‌లో మేం పని చేసుకుంటుంటే మా సినిమా లీక్ అయిందని ఎవరో చెప్పారు.
ఒక్కసారిగా కుప్పకూలిపోయాం. ఈ విషయంలో సహాయం చేసిన గుంటూరు ఎస్పీకి చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఫిర్యాదు చేసిన గంట లోపలే ఏ సిస్టమ్ నుంచి ఈ వీడియోను అప్‌లోడ్ చేశారో మాకు సమాచారం ఇచ్చారు. 12 గంటల లోపే 40 మంది టీమ్‌తో ఈ పైరసీ జరుగుతున్న రెండు హాస్టల్స్ మీద దాడి చేశారు. దాదాపు 27 మందిని అరెస్ట్ చేశారు. ఇన్ని కోట్లు పెట్టి సినిమా తీశాం. ఇంకో కోటి రూపాయిలు పెట్టి ఆ దొంగలందర్నీ పట్టుకుంటాం. ఇది పైరసీ కేసు కాదు. దొంగతనానికి సంబంధించిన కేసు. దీనిలో భాగస్వాములైన స్టూడెంట్స్ భవిష్యత్తు నాశనం అవుతుంది.
ఇది బాధపడాల్సిన విషయం అయినప్పటికీ వాళ్లు శిక్షార్హులని నా అభిప్రాయం’’ అన్నారు. పరశురామ్ మాట్లాడుతూ– ‘‘ఒక సినిమా కథను ఓకే చేయించుకోవడానికి ప్రతి డైరెక్టర్‌కి దాదాపు రెండున్నరేళ్లు పడుతుంది. ఈ ప్రయాణంలో దాదాపు 100సార్లు ఆ కథ చెప్పాలి. నిర్మాతలకు, ఆర్టిస్టులకు అనుగుణంగా మార్చుకొని తల బద్దలు కొట్టుకొని ఒక సినిమా తీస్తాం. ఇన్ని కష్టాలు పడి సినిమా తీస్తే దాన్ని జనం దాకా తీసుకువెళ్లడానికి ఎన్ని కష్టాలు పడాలి? గర్భంలో బిడ్డను 9 నెలలు మోసి ఆ కడుపులో ఉన్న బిడ్డను బయటకు తీసి దానితో సెల్ఫీలు దిగి ఆనందపడే పరిస్థితుల్లో ఉన్నట్లుగా మా సినిమా రిలీజ్‌కి రెడీ అయిన సమయంలో ఊహించని షాక్. మా జీవితాలతో ఆడుకోవద్దు’’ అన్నారు.
విజయ్ దేవరకొండ మాట్లాడుతూ – ‘‘మేం సినిమా చేసేదే థియేటర్లలో ప్రేక్షకుల స్పందన చూద్దాం అని. గీతా ఆర్ట్స్ లాంటి పెద్ద సంస్థకి జరిగింది కాబట్టి ‘మేం ఉన్నాం. నువ్వేం బాధపడొద్దు’ అని అరవింద్‌గారు ధైర్యం చెప్పారు. అదే ‘పెళ్ళి చూపులు, అర్జున్ రెడ్డి’ లాంటి చిన్న సినిమాలకు ఇలా జరిగితే మేం ఉండేవాళ్లం కాదు. స్టూడెంట్స్ అంతా మనవాళ్లే అని ముద్దుగా వాళ్లను రౌడీస్ అని పిలుచుకుంటాను. స్టూడెంట్సే నన్ను అర్థం చేసుకోకుండా నా సినిమాను బయటకు తీసుకువస్తే నేనెవరికి చెప్పుకోవాలి? ఎడిటింగ్, సౌండ్ సరిగ్గా లేని కంటెంట్‌ని చూస్తే ఏం మజా వస్తుంది? ఇప్పుడు సినిమా చేయడంకంటే ఆ సినిమా పైరసీ కాకుండా చూడటమే ముఖ్యం అనిపిస్తోంది’’ అన్నారు. నిర్మాత దామోదర ప్రసాద్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment