
సినిమాలో సినిమా నటుడిగా!
‘‘ఇప్పటివరకూ ఎన్నో రకాల పాత్రలు చేశాను. కానీ, సినిమాలో సినిమా నటుడిగా చేయడం కొత్త అనుభూతినిస్తోంది. ఇది అతిథి పాత్రే అయినప్పటికీ నిడివి తక్కువేం కాదు’’
‘‘ఇప్పటివరకూ ఎన్నో రకాల పాత్రలు చేశాను. కానీ, సినిమాలో సినిమా నటుడిగా చేయడం కొత్త అనుభూతినిస్తోంది. ఇది అతిథి పాత్రే అయినప్పటికీ నిడివి తక్కువేం కాదు’’ అని అమితాబ్ బచ్చన్ చెప్పారు. ఏడు పదుల వయసులోనూ ఆయన ఉత్సాహవంతంగా సినిమాలు, టీవీ సీరియల్స్, వాణిజ్య ప్రకటనలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఇటీవల ఆయన ‘గూమ్‌కేతు’ అనే చిత్రంలో అతిథి పాత్ర చేయడానికి అంగీకరించారు. పుష్పేంద్ర మిశ్రా దర్శకత్వంలో విక్రమాదిత్య మొత్వానీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
విక్రమాదిత్య కోసమే ఈ సినిమా అంగీకరించానని అమితాబ్ చెబుతూ - ‘‘విక్రమ్ రూపొందించిన ‘ఉడాన్’ నాకు చాలా ఇష్టం. మంచి వ్యక్తులతో కలిసి ఆయన నిర్మి స్తున్న ఈ చిత్రంలో నటించాలనిపించింది. పైగా, సినిమాలో సినిమా నటుడిగా నటించాలన్నారు. దాంతో థ్రిల్ అయ్యాను. మామూలుగా ఇతర చిత్రాల షూటింగ్‌కి మేకప్ వేసుకుని లొకేషన్‌కి వెళుతుంటాను. కానీ, ఈ సినిమాలో నేను స్టార్‌ని కాబట్టి, మేకప్ వేసుకుని, షూటింగ్‌కి తయారవ్వడం... ఇలా అన్నింటినీ చిత్రీకరిస్తున్నారు. సో.. నేను షూటింగ్‌కి ఎలా రెడీ అవుతానో ప్రేక్షకులు ఈ సినిమాలో చూడొచ్చు. ఇందులో నేను పలు రకాల గెటప్స్‌లో కనిపించబోతున్నాను’’ అన్నారు.