మూడో ప్రయత్నం అయినా ఫలిస్తుందా..?
ప్రస్తుతం సౌత్ ఫిలిం ఇండస్ట్రీ స్టార్ సంగీత దర్శకుల లిస్ట్లో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు అనిరుధ్ రవిచంద్రన్. కొలవర్రీ పాటతో నేషనల్ లెవల్ గుర్తింపు తెచ్చుకున్న అనిరుద్ కోలీవుడ్లో స్టార్ హీరోల సినిమాలతో ఆకట్టుకుంటున్నాడు. వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న అనిరుధ్ చాలా కాలంగా టాలీవుడ్ ఎంట్రీ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు.
రామ్ చరణ్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన బ్రూస్లీ సినిమాతోనే అనిరుధ్ టాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వాల్సి ఉన్నా.., కుదరలేదు. తరువాత త్రివిక్రమ్, నితిన్ల కాంబినేషన్లో రూపొందిన 'అ..ఆ..' సినిమాతో అనిరుధ్ టాలీవుడ్ ఎంట్రీ కన్ఫామ్ అయ్యింది. అనిరుధ్ పేరుతో పోస్టర్లు కూడా రిలీజ్ అయ్యాయి. కానీ సగం షూటింగ్ అయిన తరువాత అనిరుధ్ స్థానంలో మిక్కీ జే మేయర్ను తీసుకున్నారు.
అయితే తాజాగా మరోసారి టాలీవుడ్ ఎంట్రీ కోసం ప్రయత్నాలు ప్రారంభించాడు అనిరుధ్. పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కించబోయే కొత్త సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ చేసే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతానికి చర్చల దశలో ఉన్న ఈ కాంబినేషన్ అయినా సెట్స్ మీదకు వస్తుందేమో చూడాలి.