
మలయాళ నటి అంజలి అమీర్ తన సహజీవన భాగస్వామికి సంబంధించి సంచలన విషయాలను బయటపెట్టారు. ఆ వ్యక్తి పెడుతున్న వేధింపులు భరించలేకుండా ఉన్నానని ఆవేదన వ్యక్తం చేశారు. భారతీయ సినీ పరిశ్రమలో మొట్టమొదటి ట్రాన్స్‌సెక్సువల్ హీరోయిన్‌గా అంజలి అమీర్ పాపులర్ అయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా తను ఎదుర్కొంటున్న కష్టాల గురించి అంజలి ఫేస్‌బుక్ లైవ్‌లో పలు విషయాలను వెల్లడించారు.
‘ఆ వ్యక్తి తనతో కలిసి జీవించాలని నన్ను బెదిరిస్తున్నాడు. కానీ నేను ఇక మీదట అతనితో జీవించాలనుకోవటం లేదు. అతని నుంచి నాకు ప్రమాదం పొంచి ఉంది. అతనితో కలిసి జీవించకుంటే నన్ను చంపేస్తానని, యాసిడ్ పోస్తానని బెదిరిస్తున్నాడు’ అని అంజలి తన బాధను వ్యక్తపరిచారు. ఈ క్రమంలో ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. ఇంకా ఆమె మాట్లాడుతూ.. అతను గత కొంతకాలం నుంచి తన సంపాదనపై ఆధారపడి జీవిస్తున్నాడని విమర్శించారు. ఈ బాధలు చూస్తుంటే తనకు ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు వస్తున్నాయని తెలిపారు. దీనిపై పోలీసుకు ఫిర్యాదు చేయాలని యోచిస్తున్నట్టు చెప్పారు. కాగా, 2018 మలయాళ బిగ్‌బాస్‌లో పాల్గొన్న అంజలి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే పెరంబు చిత్రంలో తన నటనతో ఆకట్టుకున్నారు. ప్రస్తుతం అంజలి తన బయోపిక్‌ను తెరకెక్కించాలని చూస్తున్నారు.