విలక్షణ నటి... వైవిధ్యభరిత పాత్ర!
అల్లు అర్జున్ నటించిన ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమాలో సమంత ఓ డయాబెటిక్ పేషంట్. ఈ విషయాన్ని చాలా మంది విమర్శించారు. ‘‘అదేంటి కథానాయిక డయాబెటిక్ పేషంటా...?’’ అని విమర్శించిన వాళ్లు అధికం. కానీ ఇలాంటి పాత్రలు మెయిన్ స్ట్రీమ్ సినిమాల్లో కూడా వస్తున్నాయని చెప్పొచ్చు. అదీ ప్రధాన పాత్రల్లో. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ ‘మార్గరీటా విత్ స్ట్రా ’. ఈ సినిమా ఈ వారం విడుదల కానుంది. బాలీవుడ్ నటి కల్కి కొచ్లిన్ ఈ చిత్రంలో సెరెబ్రల్ పాల్సీ వ్యాధితో బాధపడే ఓ యువతిగా నటించారు. తొలి చిత్రం ‘దేవ్ డి’ నుంచి ఇప్పటిదాకా ఎప్పుడూ వైవిధ్యమైన పాత్రలను ఎంచుకోవడం కల్కిలో విశేషం.
ఇప్పటికే తేలిన్ బ్లాక్ నైట్ ఫిలిం చిత్రోత్సవంలో ఇది ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఈ సినిమాలో తన పాత్ర గురించి కల్కి చెబుతూ-‘‘ ఈ చిత్ర దర్శకురాలు సోనాలీ బోస్ బంధువు ఇదే వ్యాధితో బాధపడుతున్నారు. ఆమెను బాగా గమనించా. ఆరు నెలల ఈ సినిమా షూటింగ్‌లో కూడా ఈ పాత్రలోనే ఉండేలా నా దినచర్యను కూడా మార్చుకున్నా. ఈ సినిమా కొంత మందికి చాలా ఇబ్బందిగా ఉండచ్చేమో. కానీ ట్రైలర్ చూసిన చాలా మంది నాకు ఫోన్ చేసి మరీ అభినందించారు. ఇలాంటి కథాంశాలను మన దేశంలో కూడా సాదరంగా ఆహ్వానించే రోజులు త్వరలోనే రావచ్చు’’ అని ఆశాభావం వ్యక్తం చేశారు.