సైలెన్స్‌  అంటున్న  స్వీటీ | Anushka Acting In Scientific Thriller Movie | Sakshi
Sakshi News home page

సైలెన్స్‌  అంటున్న  స్వీటీ

May 27 2019 7:55 AM | Updated on May 27 2019 7:55 AM

Anushka Acting In Scientific Thriller Movie - Sakshi

తమిళసినిమా: నటి అనుష్కను సన్నిహిత వర్గాలు అభిమానంగా స్వీటీ అని పిలుస్తుంటారన్న విషయం తెలిసిందే. అనుష్క నటించిన చివరి చిత్రం తెరపైకి వచ్చి సుమారు రెండేళ్లు దాటింది. భాగమతి తరువాత ఈ అమ్మడు మరో చిత్రం చేయలేదు. మధ్యలో దర్శకుడు గౌతమ్‌మీనన్‌ దర్శకత్వంలో నటించడానికి అంగీకరించినట్లు అనుష్క బహిరంగంగా వెల్లడించినా, ఆ చిత్రం సెట్‌పైకి వెళ్లలేదు. మరో విషయం ఇంజి ఇడుప్పళగి చిత్రంలోని పాత్ర కోసం తన బరువును కనీసం 100 కిలోలకు పెంచుకున్న అనుష్క ఆ తరువాత దాన్ని తగ్గించుకోవడానికి నానా తంటాలు పడిందనే చెప్పాలి. మొత్తం మీద సుదీర్ఘ శ్రమ తరువాత బరువు తగ్గి కొత్త అందాలను సంతరించుకుంది. తాను ఎలా బరువు తగ్గానన్న విషయాలను ఒక బుక్కుగా రాసి ఇటీవల విడుదల చేసింది కూడా. కాగా మళ్లీ ముఖానికి రంగేసుకోవడానికి రెడీ అయిన అనుష్క సైలెన్స్‌ అనే సైంటిఫిక్‌ థ్రిల్లర్‌ కథా చిత్రంలో నటించడానికి అంగీకరించింది.

తెలుగు, తమిళం, హింది భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తెలుగులో నిశబ్దం అనే టైటిల్‌ను నిర్ణయించారు. హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ, కేఎఫ్‌సీ సంస్థలు నిర్మిస్తున్నాయి.  ఇందులో నటుడు మాధవన్, హాలీవుడ్‌ నటుడు మైఖేల్‌ మెడ్సన్, నటి అంజలి, శాలినీపాండే ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం శుక్రవారం అమెరికాలో సైలెంట్‌గా షూటింగ్‌ను ప్రారంభించింది. నటి అనుష్క ఇంతకుముందు పలు విభిన్నమైన కథా పాత్రల్లో నటించినా, ఈ సైలెన్స్‌ చిత్రంలో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచే కథా పాత్రలో కనిపించనుందట. దీంతో సైలెన్స్‌ చిత్రంపై సినీవర్గాలు, ప్రేక్షకుల్లో ఇప్పటి నుంచే ఆసక్తి నెలకొంది.
 
   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement