అంతఃపురంలో అందాల చిలుకా...
అంతఃపురంలో అందాల చిలుకా...
Published Fri, Oct 4 2013 12:13 AM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM
సకలకళా ప్రవీణురాలు రాణీరుద్రమ. యుద్ధ విద్యల్లోనే కాదు, లలిత కళల్లో కూడా ఆమె నిష్ణాతురాలే. అందుకే ఆమెలోని అన్ని కోణాలనూ ఆవిష్కరించే పనిలో ఉన్నారు దర్శ కుడు గుణశేఖర్. ప్రస్తుతం ఆయన ‘రుద్రమదేవి’ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న విషయం తెలిసిందే. రుద్రమదేవిగా టైటిల్ రోల్ పోషిస్తున్న అనుష్కపై ఓ ప్రత్యేక గీతాన్ని తెరకెక్కించే పనిలో ఉన్నారు గుణశేఖర్. ఈ పాటలో అనుష్కతో పాటు నథాలియాకౌర్, జరాషా కూడా నర్తిస్తున్నారు.
హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్ ఏడెకరాల్లో వేసిన భారీ అంతఃపురం సెట్‌లో ప్రస్తుతం ఈ పాట చిత్రీకరణ జరుగుతోంది. ‘అంతఃపురంలో అందాల చిలుకా’ అనే పల్లవితో మొదలయ్యే ‘సిరివెన్నెల’ గీతానికి ఇళయరాజా స్వరాన్ని అందించగా, రాజుసుందరం నృత్యరీతుల్ని సమకూరుస్తున్నారు. ఈ పాటతో నాల్గవ షెడ్యూల్ మొదలైందని గుణశేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ -‘‘దేశం గర్వించదగ్గ సాంకేతిక నిపుణులు పనిచేస్తున్న చిత్రమిది.
ఇందులోని ప్రతి అంశం చరిత్రకు అద్దం పడుతుంది. ముఖ్యంగా తోట తరణి వేసిన సెట్‌లు ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ. 800 ఏళ్ల క్రితం తవ్వకాల్లో బయటపడ్డ కట్టడాలు, అప్పట్లో ఎలా ఉండేవో కళ్లకు కట్టారాయన. ఆర్కియాలజిస్ట్‌లు సైతం ఈ సెట్స్‌ని చూసి ఆశ్చర్యానికి లోనై అద్భుతం అని ప్రశంసిస్తున్నారంటే... తరణి ప్రతిభ ఏ స్థాయిలో ఉందో అవగతం చేసుకోవచ్చు.
సినిమా చాలాబాగా వస్తోంది. చరిత్రలో నిలిచే సినిమా అవుతుంది’’ అని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ చిత్రానికి మాటలు: పరుచూరి బ్రదర్స్, కెమెరా: అజయ్ విన్సెంట్, పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి, ఎడిటింగ్: శ్రీకర్‌ప్రసాద్, కాస్ట్యూమ్ డిజైనర్: నీతాలులా్ల(‘జోధా అక్బర్’ ఫేం), ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కె.రామ్‌గోపాల్, నిర్మాణం: గుణా టీమ్ వర్క్స్.
Advertisement